మాదిగలకు హక్కులు అంబేద్కర్ వల్ల రాలేదని, బాబూ జగజ్జీవన్ రామ్ వల్ల వచ్చాయని వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో, ఉండవల్లి శ్రీదేవిపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ పై శ్రీదేవి వ్యాఖ్యలను టీడీపీ నేతలు కూడా ఖండించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీదేవి కామెంట్లపై టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు.
అంబేద్కర్ అంటే వైసీపీ నేతలు ముందు నుంచి అయిష్టతను వ్యక్తం చేస్తున్నారని వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. అంబేద్కర్ ను గతంలోనూ వైసీపీ కీలక నేతలు చాలా సార్లు కించపరిచారని ఆరోపించారు. శ్రీదేవి చేసిన వ్యాఖ్యలు శిక్షార్హమని, ఆమెపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళితులను కేవలం ఓటు బ్యాంకుగానే వైసీపీ నేతలు చూస్తున్నారని వర్ల రామయ్య ఫైర్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఉండవల్లి శ్రీదేవి స్పందించారు. అంబేద్కర్ పై తాను ఆ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. రాజ్యాంగ నిర్మాతను తాను దూషించాననడం అవాస్తవమని, తాను చిన్ననాటి నుంచి అంబేద్కర్ వాదినేనని చెబుతున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శ్రీదేవి ఆరోపించారు. మార్ఫింగ్, ఎడిటింగ్ చేసిన వీడియోలను వైరల్ చేస్తున్నారని అన్నారు.
అటువంటి వీడియోల వల్ల అంబేద్కర్ వాదుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని శ్రీదేవి కోరారు. అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ దళితులకు రెండు కళ్ల లాంటివారని శ్రీదేవి అన్నారు. మార్ఫింగ్ వీడియోతో దుష్ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు.