టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పల్నాడు జిల్లాల్లో కదం తొక్కిన లోకేష్ తాజాగా తాడికొండ నియోజకవర్గంలో ప్రవేశించారు. ఈ సందర్భంగా అమరావతిని జగన్ ఏ విధంగా నిర్వీర్యం చేశారో చెబుతూ రావెలలో ‘అమరావతి ఆక్రందన’ పేరుతో రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ బహిష్కృత నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఒక దశలో తాను కూడా రైతులను మోసం చేశానని ఉండవల్లి శ్రీదేవి కన్నీటి పర్యంతమయ్యారు.
ఆ తర్వాత ప్రసంగించిన లోకేష్…జగన్ పై నిప్పులు చెరిగారు.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి కోసం రైతులు మూడు పంటలు పండే పచ్చటి పొలాలను త్యాగం చేశారని లోకేష్ ప్రశంసించారు. అయితే, అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ అమరావతిని జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అసలుసిసలు అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించింది చంద్రబాబే అని లోకేష్ అన్నారు. గత ఎన్నికలకు ముందు అమరావతికి జై కొట్టిన జగన్ ఎన్నికలు పూర్తయిన వెంటనే మూడు రాజధానులు అంటూ కొత్త పల్లవి అందుకున్నారని మండిపడ్డారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న వెయ్యి మంది అమరావతి రైతులపై జగన్ కేసు పెట్టారని దుయ్యబట్టారు.
తొలిసారి తాను అమరావతి రైతుల కోసం స్టేషన్ కి వెళ్ళానని లోకేష్ చెప్పుకొచ్చారు. అమరావతి రైతులను పోలీసులు బూటుకాళ్లతో తన్నారని, లాఠీలతో కొట్టారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి అమరావతిలో బాత్రూంపై కూడా డ్రోన్లు ఎగరవేసి నిఘా పెట్టారని సంచలన విమర్శలు గుప్పించారు. ఉండవల్లి శ్రీదేవి గారిని కూడా ఇబ్బంది పెట్టారని చెప్పారు.
కాగా, కొద్దిరోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉండవల్లి శ్రీదేవి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే త్వరలోనే తాను ఏ పార్టీలో చేరబోతున్నానో త్వరలో ప్రకటిస్తానని శ్రీదేవి అన్నారు. ఈ రోజు తాడికొండలో పాదయాత్రలో శ్రీదేవి పాల్గొనడంతో ఆమె టిడిపిలో చేరిక లాంఛనమే అని అర్థమవుతుంది. త్వరలోనే ఆమె సైకిల్ ఎక్కబోతున్నారని తెలుస్తోంది.