టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు, జైలుకు నిరసనగా హైదరాబాద్లోని ఐటీ ఉద్యోగులు ఈ రోజు ఉదయం నుంచి కదం తొక్కారు. `లైట్స్ ఫర్ మెట్రో` నినాదంతో చేపట్టిన ఈ నిరసన భాగ్యనగరాన్ని కుదిపేసింది. ఎక్కడికక్కడ ఐటీ ఉద్యోగులు నల్ల టీ షర్టులు ధరించి మెట్రో రైళ్లలో ప్రయాణించేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకూ మెట్రో రైలులో నల్ల టీ షర్ట్లతో ప్రయాణించేందుకు రోడ్లపై వచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఉద్యోగులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పలు చోట్ల ఉద్యోగులపై లాఠీ చార్జి కూడా చేశారు. ఇదిలావుంటే, వైసీపీ రెబల్ నాయకురాలు, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కుటుంబ సమేతంగా వచ్చి రాచకొండ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులకు మద్దతు తెలిపారు. అయితే.. శ్రీదేవి కుటుంబాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఆమెను కనీసం రోడ్డుపైనా నడవకూడదని, వెంటనే వెళ్లి పోవాలని ఆదేశించారు.
అయితే.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందంటూ పోలీసుల ఆంక్షల నడుమే.. శ్రీదేవి తన భర్తతో కలిసి కొంత దూరం పాదయాత్రగా వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు ఆమెను అరెస్టు చేసి రాచకొండ పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్బంగా ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. శాంతి యుతంగా ఉద్యోగులు చేపట్టిన నిరసనను పోలీసులు ఉద్దేశ పూర్వంగా భగ్నం చేస్తున్నారని అన్నారు. కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదా? అని ప్రశ్నించారు. అంతేకాదు.. ఏపీలోనే అరాచక పాలన సాగుతోందని అనుకున్నామని.. కానీ, తెలంగాణలోనూ అదే తరహా పాలన సాగుతోందన్న విషయం పోలీసుల ప్రవర్తనను చూస్తే స్పష్టంగా తెలుస్తోందని వ్యాఖ్యానించారు.