వైసీపీలో ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేల రాజకీయాలు వీధిన పడుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కూడా గడవకుండానే ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, ఆరోపణలు చేసుకోవడం, వివాదాలకు దిగడం సహజ ప్రక్రియగా మారిపోయింది. దీంతో వైసీపీపై ప్రజల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. తాజాగా గుంటూరులోని బాపట్ల ఎంపీ నందిగం సురేష్, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిల వివాదం పతాక స్థాయికి చేరింది.
తన నియోజకవర్గం వ్యవహారాల్లో ఎంపీ వేలు పెడుతున్నారంటూ.. ఎమ్మెల్యే కొన్నాళ్లుగా అసహనంతో ఉన్న విషయం తెలిసిందే. అయితే, తన సొంత ప్రాంతం కాబట్టే.. తనకు బాధ్యత ఉందని.. అందుకే ఇక్కడి కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నానని ఎంపీ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వరకు కూడా వెళ్లింది. ఎంపీ కారుపై కూడా దాడి జరిగింది. తాజాగా.. ఎమ్మెల్యే శ్రీదేవి ఫోన్ ట్యాప్ చేయాలంటూ.. ఎంపీ సురేష్ పోలీసులనే పురమాయించారనే ఆరోపణలతో సదరు అధికారులను ప్రభుత్వం వీఆర్ కు పంపింది.
ఇక, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే వివాదాల్లో ఇదొక్కటే కాదు.. ఇదే జిల్లాలో నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలుకు, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజీని మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విభేదాలు కొనసాగుతున్నాయి. కోటప్పకొండ తిరునాళ్లలో పైచేయి సాధించేందుకు ఇరు పక్షాలు ప్రయత్నించడం, ఎంపీ కారుపై ఎమ్మెల్యే మరుదులు దాడులు చేయడం తీవ్ర వివాదమైన విషయం తెలిసిందే. ఈ వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అటు ఎంపీకానీ, ఇటు ఎమ్మెల్యే కానీ ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇక, ఇలా కీచులాడుకుంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ జిల్లాకే పరిమితం కాలేదు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఎంపీ.. మార్గాని భరత్రామ్కు, అదే జిల్లాలోని రాజానగరం ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు జక్కంపూడి రాజాకు మధ్య వీధి పోరాటాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇసుక విషయంలో తలెత్తిన వివాదం.. వ్యక్తిగత దూషణలు, ఫిర్యాదుల వరకు కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎంపీ ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఇప్పటికీ తేలలేదు. ఇక, అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పైనా.. అక్కడి ఎమ్మెల్యేలు అసహనంతో ఉన్నారు.త నకు సంబందం లేని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వేలు పెడుతున్నారని ఆయనపై ఇప్పటికే నాలుగైదు ఫిర్యాదులు అందాయి. మొత్తంగా వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగాయనేది వాస్తవం అంటున్నారు పరిశీలకులు.