ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం కాక రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఏపీ మంత్రులకు, సినీ హీరోలకు, ప్రముఖులకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ వ్యవహారంపై సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. చిరంజీవి, నాగార్జునలతోపాటు ఇతర సినీ పెద్దలు అడిగితేనే ఆన్లైన్ టికెటింగ్ పెట్టామని రోజా అన్నారు. సినిమా వాళ్లతో చర్చలు జరిపి, వాళ్ల అభ్యర్థన ప్రకారమే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు.
అయితే, ఇప్పుడు కొంతమంది రాజకీయ లబ్ధి కోసం టికెట్ల వ్యవహారాన్ని సమస్యగా మార్చారని అన్నారు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న కొందరు సినీ ప్రముఖులు ఇప్పుడు చర్చలకు వస్తున్నారని చెప్పారు. చర్చలకు జగన్ ఎప్పుడూ సిద్ధమేనని, పేద ప్రజల కోసమే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. చిన్న సినిమాలకు థియేటర్లు కావాలన్నా, పేదలకు తక్కువ ధరలకే సినిమా అందించాలన్నా రేట్లు తగ్గించక తప్పదని అన్నారు.
పెద్ద సినిమాల బడ్జెట్ ఎక్కువని, అందుకే తమకు ఇబ్బంది అని చెప్తున్నారని, కానీ, చిన్న సినిమాల పరిస్థితి వేరని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో ప్రభుత్వం పెద్దలు,సినీ ప్రముఖులు చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. కానీ, సినిమా టికెట్ల వ్యవహారాన్ని పొలిటికల్ గేమ్ కోసం కొందరు నాయకులు వాడుకుంటున్నారని రోజా ఆరోపించారు. కలెక్షన్ ఎక్కువ వస్తుందని చెప్పినా హీరో నాని కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.