వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా కన్నీటి పర్యంత మయ్యారు. తిరుపతిలో జరిగిన ఎపి అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె… అధికారులు తన మాట వినడం లేదని, తనను పట్టించుకోవడం లేదని…కనీసం మర్యాద ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నియోజక వర్గ సమస్యలు, ప్రొటోకాల్ విషయంలో అధికారుల తీరుపై కమిటీకి ఫిర్యాదు చేశారు. నగరిలో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల సమావేశానికి తనను ఆహ్వానించలేదని.. అధికారులు తనకు తెలియకుండా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని..ఆమె ఆవేదన చెందారు.
ఓ ఎమ్మెల్యేగా ఇది నాకు అవమానమని ఈ విషయం సీరియస్ గా తీసుకోవాలని కోరుతూ ఆమె కమిటీకి ఫిర్యాదు చేశారు. ప్రివిలేజ్ కమిటీ ముందే ఎమ్మెల్యే రోజా కన్నీళ్లు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.
రోజా ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. ప్రోటోకాల్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగినట్టు ప్రాథమికంగా అర్థమవుతోంది అన్ని విషయాలు జిల్లా కలెక్టర్కు చెప్పామని, అవన్నీ సరిచేస్తామని కాకాణి తెలిపారు. ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.