నగరి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. నగరి ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నేత రోజా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. రోజాకు, స్థానికంగా కొందరు వైసీపీ నేతలకు మధ్య కోల్డ్ వార్ చాలాకాలంగా జరుగుతోందని టాక్ ఉంది. గతంలో ప్రోటోకాల్ పాటించడంలేదని, తనను అవమానిస్తున్నారని రోజా బాహాటంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం వైరల్ అయింది.
ఇక, ఇటీవల జగన్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కొందరు చించివేసిన ఘటనతో నగరి వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే పార్టీలో కోవర్టులున్నారంటూ చిత్తూరు జిల్లా పోలీసులను రోజా ఆశ్రయించడం కలకలం రేపింది. వైసీపీలో కోవర్టులు ఉన్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్ ను రోజా కోరడం చర్చనీయాంశమైంది.
వైసీపీలో ఉంటూ టీడీపీతో కలిసిన వారిని క్షమించేది లేదని రోజా అన్నారు. అంతేకాదు, ఫ్లెక్సీల్లో మంత్రి పెద్దిరెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్ ల ఫొటోలు వేసుకుని అధికారులను కూడా బెదిరిస్తున్నారని రోజా ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సదరు నేతలను చట్టపరంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. గతంలో పార్టీ నుంచి బహిష్కరణకు గురైనవారే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
కోవర్టుల అంశాన్ని మంత్రి పెద్దిరెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లానని రోజా అన్నారు. తాజాగా రోజా ఫిర్యాదుతో వైసీపీలో వర్గ పోరు మరోసారి బట్టబయలైంది. అయితే, మంత్రి పదవి ఆశించి భంగపడ్డ రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవినిచ్చారని, దీంతో, ఆమె అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఆ పదవితో రోజాకు తగినంత గుర్తింపు రాకపోగా….ఎమ్మెల్యేగా ప్రొటోకాల్ కూడా పాటించకపోవడంతో ఆమె తీవ్ర నిరాశతో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మరి, తాజాగా కోవర్టుల వ్యవహారంపై సీఎం జగన్ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.