ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తూ జగన్ తొలి జాబితా విడుదల చేసిన వెంటనే సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన కొందరు నేతలు పార్టీ పై విమర్శలు చేయడం మొదలుబెట్టారు. ఇక, రెండో జాబితాలో 27 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీల స్థానాలను జగన్ మార్చడంతో ఒక్కసారిగా వైసీపీలో అసంతృప్త జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
విష్ణును విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన జగన్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఇన్చార్జిగా వెల్లంపల్లిని నియమించారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు విష్ణు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. విష్ణుతో వెల్లంపల్లి మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన సుముఖత చూపలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు విష్ణు….వైఎస్ షర్మిలతో టచ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఇక, తన అనుచరులతో పార్టీ మారే విషయంపై విష్ణు అభిప్రాయాలు కూడా సేకరించినట్లు తెలుస్తోంది.
వైసీపీ నేతలకు విష్ణు అందుబాటులో లేకపోవడంతో ఆయన పార్టీ మారడం దాదాపుగా ఖాయం అయిందని బెజవాడ రాజకీయాలలో చర్చ జరుగుతుంది. ఈ రోజు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి తన పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశాలున్న నేపథ్యంలో రేపో మాపో విష్ణు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతారని తెలుస్తోంది.