ఏపీలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓ వైపు బలవంతపు ఏకగ్రీవాలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు…మరో వైపు ఎన్నికల విధులు నిర్వహిస్తోన్న అధికారులను సైతం బెదిరించేందుకు వెనుకాడడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. గెలిచినా..ఓడినా…వైసీపీ బలపరిచిన అభ్యర్థే సర్పంచ్ అంటూ వైసీపీ ఎమ్మల్యేలు బహిరంగంగా వార్నింగ్ ఇచ్చే పరిస్థితులు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే జగన్ సర్కార్‌పై ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాక్షసపాలన సాగుతోందని, అది ఆంధ్రా ప్రజల దురదృష్టమని బాలయ్య షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలలో ఈ తరహా పాలన చూశామని, కానీ, ఇపుడు ప్రత్యక్షంగా తెలుగు రాష్ట్రంలో ఈ తరహా పాలన చూడాల్సి రావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ బలపరిచిన అభ్యర్థులంతా ఎన్నికల్లో పోటీ చేసి విజయకేతనం ఎగురవేయాలని బాలయ్య పిలుపునిచ్చారు. కార్యకర్తలు, అభిమానులతో తనది జన్మజన్మల అనుబంధమని, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సహించబోనని బాలయ్య వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ లతో కొద్దిగా బిజీగా ఉన్నానని చెప్పిన బాలయ్యా….అవి పూర్తయిన తర్వాత ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలందర్నీ కలుసుకుంటానని చెప్పారు.
నెల్లూరు జిల్లా నాయకులతో ఆదివారం ఫోన్లో మాట్లాడిన బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ఫోన్లో నిర్వహించిన బాలకృష్ణ…. కావలి మండలం రుద్రకోటలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి ఫోన్ చేసి అక్కడి కార్యకర్తలు, అభిమానులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే పంచాయతీ ఎన్నికలపై వారితో బాలయ్య చర్చించారు.