గత రెండు రోజులుగా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. రైతులతో, కార్యకర్తలతో, ప్రజలతో మమేకమైన బాలకృష్ణ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై ఫోకస్ పెట్టిన బాలకృష్ణ…జగన్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన బాలకృష్ణ….రైతులను రెచ్చగొట్టవద్దని హెచ్చరించారు. రైతులను రెచ్చగొడితే ఢిల్లీలో రైతుల ఉద్యమం తరహాలో ఏపీలోనూ ఉద్యమం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. తన హిందూపురం పర్యటనలో మూడో రోజూ ప్రభుత్వంపై బాలకృష్ణ విమర్శలు గుప్పించారు. హిందుపురంలో పేకాట, మట్కాను అధికార పార్టీ నేతలు ప్రోత్సహిస్తున్నారని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మాట వినని అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తోందని, ఇప్పటికే ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం మార్చిందని నిప్పులు చెరిగారు. ఇళ్ల పట్టాల పంపిణీలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని ఆరోపించారు.
ఆలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని, ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉదాసీన వైఖరి వల్లే దేవాలయాలు, హిందూ దేవుళ్ల విగ్రహాలపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తేనే భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నానరు. హిందూపురాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని బాలకృష్ణ డిమాండ్ చేశారు. అవసరమైతే ఈ విషయంపై సీఎం జగన్‌రెడ్డిని కలుస్తానని చెప్పారు. హిందుపురాన్ని జిల్లాగా ప్రకటించాలని గతంలోనే జగన్ కు బాలకృష్ణ లేఖ రాసిన సంగతి తెలిసిందే.