ఏపీలో వైసీపీ నేతల తీరు తరచూ వివాదాస్పదమవుతోన్న సంగతి తెలిసిందే. అధికారం ఉందన్న అహంతో వైసీపీ నేతలు కన్నుమిన్ను కానరాకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై వైసీపీ నేతలు బెదిరింపులకు దిగడంపై గతంలో విమర్శలు వచ్చాయి. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎంతమంది హితవుపలికినా వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సీపీఎం మహిళా నేతలపై స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యవహరించిన తీరు అందుకు నిలువెత్తు నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి.
ఆస్తి , చెత్త పన్నుల పెంపునకు నిరసనగా సత్తెనపల్లి మున్సిపల్ ఆఫీస్ వద్ద సీపీఎం నేతలు నిరసన ప్రదర్శనకు దిగారు. మున్సిపల్ ఆఫీస్‌లోకి దూసుకువెళ్లిన సీపీఎం నేతలు మున్సిపల్ కౌన్సిల్ హాల్ మెట్లకు అడ్డంగా కూర్చొని శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన అంబటి కౌన్సిల్ హాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా…అంబటిని సీపీఎం నేతలు అడ్డుకున్నారు.
వారికి నచ్చజెప్పి దారి వదలాల్సిందిగా కోరాల్సిన అంబటి….అందుకు భిన్నంగా దూకుడుగా వ్యవహరించడం వివాదాస్పదమైంది. మెట్లపై కూర్చునన సీపీఎం మహిళానేతలను తొక్కుకుంటూనే ఎమ్మెల్యే అంబటి, కొందరు వైసీపీ నేతలు కౌన్సిల్ హాల్లోకి వెళ్లిపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మహిళలని కూడా చూడకుండా అంబటి రాంబాబు వ్యవహరించిన తీరుపై సీపీఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ తర్వాత ఆందోళన చేస్తున్న సీపీఎం నేతలను పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్లి బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ధర్నాకు దిగిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో పోలీసులు, సీపీఎం నేతలకు మద్య వాగ్వాదం, తోపులాట జరిగింది.