రాజకీయ నాయకులు సభల్లో మాట్లాడేటపుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీడియా, సోషల్ మీడియా ఇంత యాక్టివ్ గా ఉన్న ఈ జమానాలో మంచి మాటలు ఎంత వేగంగా వ్యాపిస్తాయో…చెడు మాటలు అంతకన్నా వేగంగా వైరల్ అవుతాయి. ఈ కోవలోనే తాజాగా తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు చేసిన వ్యాఖ్యలు ఇటు మీడియాలో,అటు సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతున్నాయి. ఓ మహిళా ఎంపీడీవోపై ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్లో పల్లె ప్రగతి గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు ఎర్రబెల్లితో పాటు అధికారులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎర్రబెల్లి…”మేడమ్.. నువ్వయితే బాగనే ఊపుతున్నవు కానీ ఈడ ఊపుత లేవు. బాగనే పనిచేస్తది. ఇవన్నీ పార్కులు మంచిగ తయారుచేయాలె” అంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో అధికారులు షాకయ్యారు. ఇక, ఆ వీడియో వైరల్ కావడంతో మంత్రి తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ వివాదంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసిన ఎర్రబెల్లి…తన మాటలు వక్రీకరించారంటూ ఆరోపించారు.
మరోవైపు, ఎర్రబెల్లి దయాకరరావుపై క్రిమినల్ కేసులు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, తెలంగాణ నేత దాసోజ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన ఎర్రబెల్లిని మంత్రి వర్గం నుంచి సీఎం భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక, ఎంపీడీవో ముందు మోకాళ్లపై మోకరిల్లి తెలంగాణ మహిళలందరికీ ఎర్రబెల్లి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ డిమాండ్ చేశారు..తెలంగాణ మహిళా లోకాన్నే అవమానించేలా మంత్రి మాటలున్నాయని ఆరోపించారు