సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం..ఆ తర్వాత అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ విమర్శలు గుప్పించడంతో వివాదం తారస్థాయికి చేరింది. అయితే, సీఎం రేవంత్ తోపాటు కాంగ్రెస్ నేతల కామెంట్లపై అల్లు అర్జున్ స్పందించడంతో గొడవ పీక్స్ కు వెళ్లింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై మంత్రి సీతక్క తాజాగా షాకింగ్ కామెంట్లు చేశారు.
సందేశాత్మక చిత్రాలకు కాకుండా స్మగ్లర్ ల నేపథ్యంలో వచ్చిన సినిమాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులిస్తోందంటూ సీతక్క చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జై భీమ్ లో లాయర్ పాత్రకు అవార్డు రాలేదని, పోలీసులను అవమానించిన స్మగ్లర్ పాత్రకు వచ్చిందని విమర్శించారు. చంకలో బిడ్డను మోస్తూ న్యాయం కోసం, హక్కుల కోసం నిండు గర్భిణి పోరాడితే అవార్డు దక్కలేదని, పోలీసులను విలన్లుగా చిత్రీకరించిన స్మగ్లర్ ఉన్న సినిమాకు అవార్డు దక్కిందని విమర్శలు గుప్పించారు.
స్మగ్లర్ల ఆటకట్టించే పోలీసులను విలన్లుగా చూపిస్తారా? ఇవేం సినిమాలు? అని ప్రశ్నించారు. నేర ప్రవృత్తిని పెంచి సమాజంపై చెడు ప్రభావం చూపించే ఈ తరహా సినిమాలు కాదని, సందేశాత్మక చిత్రాలు రావాలని పిలుపునిచ్చారు.