నగరి నియోజకవర్గ వైసీపీలో వర్గపోరుపై చాలాకాలంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. మంత్రి రోజా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిల మధ్య విభేదాలున్నాయని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. రోజాకు, స్థానిక వైసీపీ నేతలు చక్రపాణి రెడ్డి, కేజే శాంతిల మధ్య కోల్డ్ వార్ చాలాకాలంగా జరుగుతోందని టాక్ ఉంది. గతంలో ప్రోటోకాల్ పాటించడంలేదని, తనను అవమానిస్తున్నారని రోజా బాహాటంగా ఆవేదన వ్యక్తం చేసిన విషయం వైరల్ అయింది. ఇక, మంత్రి పెద్దిరెడ్డి వర్సెస్ రోజా అన్నరీతిలో కూడా అంతర్గతంగా వారిద్దరి మధ్య విభేదాలున్నాయని ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే తాజాగా సొంతపార్టీ నేతల గురించి రోజా మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. వైసీపీలో అసమ్మతిపై రోజా ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆడియో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. విశాఖ గర్జన సభ తర్వాత రోజా ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన ఇలాకా అయిన నగరి పరిధిలోని నిండ్ర మండలం కొప్పెడలో రైతు భరోసా కేంద్రానికి ఆమె వ్యతిరేక వర్గం భూమి పూజ చేయడంపై రోజా తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.
ఈ కార్యక్రమానికి మంత్రి హోదాలో ఉన్న రోజాకు ఆహ్వానం అందలేదు. పైగా, ఆమె వ్యతిరేక వర్గమైన శ్రీశైలం దేవస్థానం చైర్మన్ చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ కేజే శాంతిలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో, ఈ ఎపిసోడ్ పై రోజా మరొక వైసీపీ నేతతో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆడియో బయటకు వచ్చింది.
”ఇలాంటి సమయంలో మినిస్టర్ అయిన నన్ను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా… తెలుగు దేశం, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా.. ఆ పార్టీలకు సపోర్ట్ అవుతూ… నాకు నష్టం జరిగే విధంగా మన పార్టీని దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్టో మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేం ప్రాణాలు పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేస్తుంటే.. ప్రతిరోజూ మాకు మెంటల్ టెన్షన్ పెడుతూ అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగుతుంటే… వీళ్లు పార్టీ నాయకులని ఎంకరేజ్ చేయడం కూడా బాధేస్తోంది” అంటూ రోజా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఈ ఆడియోపై రోజా అధికారికంగా స్పందించాల్సి ఉంది.