వైసీపీలో ఫైర్ బ్రాండ్, నటి రోజా ఎక్కడున్న సందడి సందడిగానే ఉంటుంది. తాను పాల్గొనే కార్యక్రమాల్లో ఆమె హడావుడి చేస్తే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటారు. ఇటీవల ఆమె గుంటూరులో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో కళాకారులతో కలిసి స్టేజీపైన వేసిన స్టెప్పుల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా క్రీడాకారులతో కలిసి కబడ్డీ ఆడుతూ ఆమె కింద పడిపోయిన వీడియోలు కూడా సామాజిక మాద్యమాల్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా రోజా తెగ బిజీగా మారిపోయాయి. తన శాఖ నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. వెండితెరపై ఒక వెలుగు వెలిగిన రోజా తరువాత బుల్లితెరపై జబర్దస్త్ న్యాయ నిర్ణేతగా కూడా ప్రత్యేక పేరు సంతరించిపెట్టుకున్నారు. ప్రజా జీవితంలో ఆమె ఎక్కడ పర్యటించిన అక్కడ ప్రజలతో మమేకమై హడావుడిగా కలివిడిగా తిరుతూ అక్కడి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంటారు. ఎక్కడైనా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగితే అక్కడ కాసేపు క్రీడాకారులతో కలిసి ఆటలు ఆడటం, కళాకారులతో కలిసి స్టెప్పులేసి ఉషారెత్తించడం లాంటివి చేస్తుంటారు.
తాగాగా ఆమె తన సొంత నియోజకవర్గం నగరిలో ఇలాగే కబడ్డీ ఆడి తెగ సందడి చేశారు. నగరి డిగ్రీ కాలేజీలో జరిగిన క్రీడా సంబరాల్లో మంత్రి రోజా పాల్గొని వాటిని ప్రారంభించారు. ఈ పోటీల్లో చిత్తూరు, పూతలపట్టు, పుంగనూరు, నెల్లూరు, నగరి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ పలు క్రీడల్లో పాల్గొని యువతను అలరించారు. కబడ్డీ, వాలిబాల్, క్రికెట్ ఆటలను సరదాగా కాసేపు ఆడి యువ క్రీడాకారులను ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా అమ్మాయిల జట్ల మధ్య జరిగిన కబడ్డీ పోటీలో కాసేపు రోజా కూడా పాల్గొన్నారు. అమ్మాయిల జట్టుపైకి రైడ్ చేస్తూ ఆమె కబడ్డీ ఆడారు. రైడ్‌కు వచ్చిన మంత్రి రోజాను అవతలి జట్టులోని అమ్మాయిలు టాకిల్ చేయడంతో ఆమె పట్టుతప్పి కింద పడిపోయారు. దీంతో అక్కడున్న అధికారులు, ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. మంత్రిగారిని అలా పట్టుకుని కింద పడేస్తారా అంటూ క్రీడాకారిణులను వారించే ప్రయత్నం చేయగా రోజా కలగజేసుకుని అడ్డు చెప్పారు. క్రీడాకారిణులను ఏమీ అనొద్దని అధికారులను సున్నితంగా వారించారు. అంతేకాదు ఆమె దీన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుని మళ్లీ రెండో సారి కూడా రైడ్‌కు వెళ్లారు.
కబడ్డీ ఆడుతూ తాను ఇలా కిందపడిపోయినా క్రీడాకారులను ఏమీ అనకుండా దాన్ని చాలా స్పోర్టివ్‌గా తీసుకుని క్రీడాకారణిలను ప్రోత్సహించిన మంత్రి రోజా తీరుకు నెటిజెన్లు ప్రశంసలు కురపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియోలు సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. ఇటీవలే ఆమె గుంటూరులో జరిగిన జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో కూడా కళాకారులతో కలిసి వేసిన స్టెప్పులు అదరగొట్టాయి.