ఆంధ్రా, తెలంగాణల మధ్య జల జగడం ముదిరి పాకాన పడుతోన్న సంగతి తెలిసిందే. పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఆ ప్రాజెక్టుల వల్ల తెలంగాణ ఎడారి అయిపోతుందంటూ సీఎం కేసీఆర్ అంటున్నారు. అయితే, తమకు హక్కుగా వచ్చిన నీటికి అదనంగా చుక్క నీటిని కూడా తీసుకోబోమని జగన్ వాదిస్తున్నారు. దీంతో, జగన్ పై టీఆర్ఎస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్ఆర్ పై కూడా పలువురు నేతలు సంచలన వ్యాఖ్యలు చచేశారు. వైఎస్ దొంగ అయితే.. జగన్ గజదొంగ అని తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని మంత్రి పువ్వాడ అజయ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. వైఎస్ పాలనలో తెలంగాణలో గొప్ప ప్రాజెక్టులు కట్టామని చెప్పుకుంటున్నారని, కానీ, ఉమ్మడి ఏపీలో ఖమ్మం జిల్లాకు ఒక్క ఎకరానికైనా వైఎస్ నీరిచ్చారా అని పువ్వాడ నిలదీశారు.
ఏపీ నీటి చౌర్యాన్ని అడ్డుకుంటామని, జగన్ దుందుడుకు చర్యలపై ఆల్రెడీ ఎన్జీటికి ఫిర్యాదు చేశామని పువ్వాడ అన్నారు. ఈ వ్యవహారంపై కేంద్రానికి సీఏం కేసీఆర్ ఫిర్యాదు చేశారని తెలిపారు. ఇరు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పరస్పర ప్రయోజనాల రీత్యా జగన్ ను స్వయంగా కేసీఆర్ ఇంటికి ఆహ్వానించారని గుర్తు చేశారు. బేసిన్లు, భేషజాలకు పోకుండా తెలుగు రాష్ట్రాలకు న్యాయం చేయాలని కేసీఆర్ ప్రతిపాదించారని వెల్లడించారు. అటువంటి నేపథ్యంలో జగన్ తాజా వైఖరి హర్షణీయం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు.