రెండున్నరేళ్ల క్రితం జగన్ చెప్పిన ఆ సుముహూర్తం రానే వచ్చింది. పాత మంత్రులందరి స్థానంలో దాదాపుగా కొత్త మంత్రులుంటారని కన్ ఫర్మ్ అయింది. ఇద్దరు, ముగ్గురు మినహా మిగతా వారందరి మంత్రి పదవి ఊడనుందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఆ ఇద్దరు ముగ్గరిలో మంత్రి పేర్ని నాని కచ్చితంగా ఉంటారని టాక్ వచ్చింది. అయితే, మరో వారంలో కొత్త మంత్రులెవరో తెలిసిపోతున్న తరుణంలో తాజాగా మంత్రి పేర్ని నాని తన మంత్రి పదవిపై మీడియాతో షాకింగ్ విషయాలు వెల్లడించారు.
బస్ అండ్ కార్ ఆపరేటర్స్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఏపీ, తెలంగాణ బస్ ఆపరేటర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘వన్ ఇండియా.. వన్ బస్’ వెబ్‌సైట్‌ను మంత్రి పేర్ని నాని ప్రారంభించిన సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసోసియేషన్‌తో బహుశా ఇదే తన చివరి సమావేశం కావొచ్చని పరోక్షంగా తాను మంత్రిగా కొనసాగడం లేదని నాని అన్నారు. ఈ నెల 11 నుంచి కొత్త మంత్రులు వస్తున్నారని, రవాణాశాఖ మంత్రిగా ఎవరు వచ్చినా తన అభిప్రాయాలను వారితో పంచుకుంటానని చెప్పారు.
మూడేళ్లపాటు వారితో కలిసి పనిచేశానని, ఇకపైనా ఏవైనా సమస్యలుంటే కొత్త మంత్రితో ప్రస్తావిస్తానని,, అవసరమైతే సీఎం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. తనకు మంత్రి పదవి రాగానే సీఎం జగన్, దేవుణ్ని తిట్టుకున్నానని సెటైర్లు వేశారు. తనకు రాకరాక మంత్రి పదవి వస్తే ఎవరి మాటా వినని ముగ్గురు అధికారుతు తన శాఖలో కీలక పదవుల్లో ఉన్నారని పంచ్ లు వేశారు.
రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా కృష్ణబాబు, కమిషనర్‌గా సీతారామాంజనేయులు, ఆర్టీసీ ఎండీగా సురేంద్రబాబు ఉన్నారని, వారు రాజకీయ నేతలను, మంత్రులు, ఎమ్మెల్యేలను లెక్కచేయరని భావించానని చెప్పుకొచ్చారు. అయితే, వారు ఎప్పుడూ అలా ఉండలేదని.. ఏది చెప్పినా ఎంతో పాజిటివ్‌గా స్పందించేవారని అన్నారు పేర్ని నాని. బస్సు, లారీ ఆపరేటర్ల కష్టాలు తనకు తెలుసని, హోం, స్టేట్ ట్యాక్స్ విషయంలో ఏపీలో కూడా వన్ ఇండియా వన్ ట్యాక్స్ విధానం ద్వారా వెళ్దామని సీఎంకు చెప్పానని, దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వెల్లడించారు.