పోలీసులను అధికార వైసీపీ నేతలు పావులుగా వాడుకొని ప్రతిపక్ష నేతలపై కక్ష సాధిస్తున్నారన్న ఆరోపణలు చాలాకాలంగా వస్తోన్న సంగతి తెలిసిందే. విమర్శలు చేసిన విపక్ష నేతలను పోలీసులతో ఇబ్బందులు పెట్టించడం, అక్రమ అరెస్టులు చేయించడం వంటివి వైసీపీ నేతలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే, తమదాకా వస్తే మాత్రం అప్పటిదాకా తమకు వత్తాసు పలికిన పోలీసులపైనా రివేంజ్ తీర్చుకోవడంలో జగన్ అండ్ కో వెనుకాడరని టీడీపీ నేతలు అంటున్నారు. మాజీ డీజీపీ సవాంగ్ ఉదంతమే ఇందుకు నిదర్శనమని విమర్శిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులపై మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. ఏం తమాషాగా ఉందా…అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన కోసం కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్ లతో పాటు మంత్రి పేర్ని నాని కూడా అక్కడకు వెళ్లారు. అయితే, మంత్రిగారి కారును పక్కకు తీయాలని అక్కడున్న పోలీసు అధికారు చెప్పడంపై నాని అసహనం వ్యక్తం చేశారు. తన కారు తీయమన్నది ఎవరంటూ ఫైర్ అయ్యారు. ఎవరయ్యా కారు తియ్యమంది…రండి ఎవరో…రండి…అంటూ వీరావేశంతో పోలీసులపైకి దూసుకుపోయారు.
తనకారుతోపాటు ఎస్పీ, డీఐజీ కార్లు పార్క్ చేసి ఉన్నాయని, డిజిగ్నేషన్లు తక్కువ ఉన్నవారి కార్లు అక్కడే ఉంచి తన కారు తీయమనడంపై నాని విరుచుకుపడ్డారు. తమాషాలు చేస్తున్నారా… నేను ఈ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిని…ఇక్కడితో పండుగ అయిపోలేదు…అంటూ చెడా మడా తిట్టేశారు. ఇదంతా చూసిన పోలీస్ ఉన్నతాధికారి..నానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. దీంతో, పోలీసులపై మంత్రి పేర్ని నాని జులుం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.