ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీ నేతల్లో ఓ విష సంస్కృతి వేళ్లూనుకొని పోయిందన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టడం, కుదరకుంటే వ్యక్తిగత దూషణలకు దిగడం….బూతులు తిట్టడం కొందరు అధికార పార్టీ నేతలకు పరిపాటిగా మారింది. ఏపీలో బూతుల మంత్రిగా పేరున్న కొడాలి నాని…టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పై నోటికొచ్చినట్లుగా చాలాసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పెను దుమారం రేపింది.
అయితే, గురివింద నలుపు దానికి తెలియనట్లుగా…వైసీపీ నేతల బూతులు వారికి మాత్రం తెలియవన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీలో వైసీపీ నేతలు…విపక్ష నేతలపై పరుష పదజాలంతో రెచ్చిపోతుంటే…తాము కూడా ఏమీ తక్కువ తినలేదని తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు పోటీపడుతున్నారు. తాజాగా వైఎస్సార్ టీపీ అధినేత వైఎస్ షర్మిలపై మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. మంగళవారం మరదలు అంటూ షర్మిలపై నిరంజన్ రెడ్డి చేసిన కామెంట్లు కాక రేపుతున్నాయి.
పార్టీ పెట్టింది మొదలు…నిరుద్యోగుల కోసం షర్మిల గళం విప్పుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే షర్మిల…ప్రతి మంగళవారం…నిరుద్యోగ దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాదయాత్ర చేస్తూనే…మంగళవారం నాడు షర్మిల దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే షర్మిలపై నిరంజన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలంటూ ”మంగళవారం మరదలు ఒకామె బయలు దేరింది’’ అని నిరంజన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది.
నిరుద్యోగుల కోసం షర్మిల డిమాండ్ వెనుక ఆంధ్రావాళ్ల కుట్ర ఉందని కూడా నిరంజన్ రెడ్డి ఆరోపించడం విశేషం. తెలంగాణలోని ఉద్యోగాల్లో 20 శాతం నాన్ లోకల్ కేటగిరీలో ఆంధ్రావారికి చెందుతాయని, వారికోసమే షర్మిల మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించడంపై విమర్శలు వస్తున్నాయి.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా లోకల్ సెంటిమెంట్ ను రెచ్చగొట్టేలా నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు.