పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తు 45.72 మీటర్లు నుంచి 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ ఏపీ మాజీ సీఎం జగన్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అలా చేయడం వల్ల194.6 టీఎంసీలు ఉండాల్సిన నీటి నిల్వ 115 టీంఎసీలకే పడిపోతుందని, ఈ విషయంపై కేంద్రానికి ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదని ఎన్డీఏ ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ వ్యాఖ్యలపై ఏపీ జలవనరుల అభివృద్ధి శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని నిమ్మల తేల్చి చెప్పారు.
150 అడుగుల మేర నీటి నిల్వ ఉండేలా 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు ఫేజుల పేరుతో పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు కుదించిన ఘనత జగన్ దేనని ఎద్దేవా చేశారు. ఆ ప్రకారం పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పలుమార్లు ప్రతిపాదనలు పంపింది గత ప్రభుత్వమేనని చురకలంటించారు. కానీ, ఆ బురదను తమ ప్రభుత్వంపై చల్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
జగన్ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల 41.15 మీటర్లకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన విధంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ క్రింద నిధులు విడుదల అవుతాయని, ఫేజ్-2 లో మాత్రం 45.72 మీటర్ల మేర ప్రాజెక్టు ఎత్తుకు అనుగుణంగా రూ.30 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ నిధులు అవసరమవుతాయని తాము ప్రతిపాదించామని తెలిపారు.