కిలత్తూరు నారాయణస్వామి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న ఆయన జగన్ కేబినెట్లో వరుసగా మంత్రి పదవిని కోల్పోకుండా దక్కించుకున్న ఘటికుడు. కానీ, ఇప్పుడు ఆ మంత్రి వర్యులు నిర్వేదంలో మునిగిపోయారు. తనను కలిసిన మీడియా మిత్రుల వద్ద.. `ఏమో నాయనా.. నాగురించి మాత్రం రాయొద్దు“ అని విన్నపాలు చేస్తున్నారు.
దీంతో మీడియా మిత్రులు ఊరుకుంటారా? అసలు ఏం జరుగుతోందనే విషయంపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ స్వామి టికెట్కు గండి కొడుతున్నారనే విషయం స్పష్టమైంది. ఆయన ఎప్పుడు మాట్లాడినా.. సీఎం జగన్ను ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. అదేసమయంలో తమ సామాజిక వర్గాన్ని ఎదగ కుండా రెడ్డి వర్గం అడ్డు పడుతోందని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. పైగా నియోజకవర్గంలోనూ.. ఆయనకు సెగ తప్పడం లేదు.
అందరిలాగానే ఆయన కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్నారు. కానీ, ఎక్కడికి వెళ్లినా.. నారాయణ స్వామికి ప్రశ్నలు తప్పడం లేదు. పోనీ.. దీనిని ఏదో రకంగా తప్పించుకుందామని అనుకున్నా.. తన శాఖలోనే తనకు వాల్యూ లేకుండా పోతోందని ఆయన వగరుస్తున్నారు. ఉన్నతాధికా రులు తనను, తన మాటను పట్టించుకోవడం లేదని బాహాటంగానే చెప్పేస్తున్నారు.
అత్యంత కీలకమైన ఎక్సైజ్ శాఖ మంత్రిగా నారాయణ స్వామికి పగ్గాలు అప్పగించారు. అయితే.. ఈ శాఖకు సంబంధించిన లెక్కలు ఆయనకు తెలియడం లేదు. అదేసమయంలో ఎక్సైజ్ అధికారుల బదిలీల్లోనూ ఆయనప్రమేయం ఉండడం లేదు. ఏదో నామ్కే వాస్తే అన్నట్టుగా తన టేబుల్ మీదకు వస్తున్న ఫైళ్లపై సంతకాలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన వద్దప్రస్తావిస్తే.. ఏమో నాయనా,.. నా పరిస్థితి నాకే అర్ధం కావడం లేదు. కానీ, నా గురించి మాత్రం రాయొద్దని వేడుకుంటున్నారు. సో.. మొత్తానికి ఈయన మానసికంగా అయితే.. సిద్ధమైపోతున్నట్టు తెలుస్తోంది.