ఏపీ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం లోకేశ్ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీకి కట్టుబడి తమ ప్రభుత్వం తరఫున తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ లో 208 నంబర్ గదిలో లోకేశ్ కు ఛాంబర్ కేటాయించారు. వేద పండితుల మధ్య ప్రత్యేక పూజలు చేసిన తర్వాత లోకేశ్ తన ఛాంబర్ లోకి అడుగుపెట్టారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన అన్నమాట ప్రకారమే తొలి సంతకం ఆ ఫైలు పై పెట్టారు. అయితే, తాజాగా విద్యా శాఖా మంత్రి హోదాలో లోకేశ్ దానికి ఆమోదం తెలుపుతూ సంబంధిత ఫైలుపై సంతకం చేశారు. మెగా డీఎస్సీ కింద 16347 పోస్టుల భర్తీకి ఆమోదం లభించడంతో రేపో మాపో నోటిఫికేషన్ జారీ కానుంది.
అంతకుముందు, సచివాలయంలో మంత్రి లోకేశ్ కు అధికారులు ఘన స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి లోకేశ్ కు సహచర మంత్రులు నిమ్మల రామానాయుడు, రాంప్రసాద్ రెడ్డి, సవిత, గుమ్మడి సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ ఎంపీ కనకమేడల, పార్టీ ఎమ్మెల్యేలు తదితరులు అభినందనలు తెలిపారు. ఆ తర్వాత వారందరితో లోకేశ్ కాసేపు చిట్ చాట్ చేశారు.