గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా లోకేష్ పై సాక్షి మీడియా ఇష్టారీతిన వార్తలు రాసిందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ పత్రికపై లోకేష్ పరువు నష్టం దావా కూడా వేశారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఆ దావా విచారణ కోసం విశాఖ కోర్టుకు లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ కేసు గెలుస్తామని లోకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసు విచారణ జరుగుతున్నప్పటికీ బ్లూ మీడియాలో మార్పు రాలేదని, సాక్షి మీడియాపై తన పోరాటం కొనసాగుతుందని అన్నారు.
తనపై చేసిన ఏ ఒక్క ఆరోపణను సాక్షి మీడియా నిరూపించలేకపోయిందని చెప్పారు. ఇకపై అయినా సాక్షి వాస్తవాలు తెలుసుకుని వార్తలు రాయాలని హితవు పలికారు. తప్పుడు ప్రచారం చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
జగన్ చేసిన లిక్కర్ స్కాంపై విచారణ జరుగుతుందని, విచారణ అనంతరం ఈ స్కాంలో భాగస్వాములైన అందరిపై చర్యలు తప్పవన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులు, వైసీపీ నేతలపై రెడ్ బుక్ ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని, ఈ రెడ్ బుక్ ఓపెన్ అయిన చాలా రోజులైందని లోకేష్ చెప్పారు. తప్పు చేశారని తేలితే వారిపై చర్యలు ఉంటాయని, ఇప్పటి నుంచే జగన్ ఎందుకు కంగారు పడుతున్నాడని ప్రశ్నించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని, ప్రభుత్వ వాహనం, వసతి వినియోగించలేదని, ఆఖరికి ఫ్లయిట్ టిక్కెట్లు కూడా తానే కొనుక్కుంటున్నానని అన్నారు. క్యాలండర్ ప్రకారం సూపర్ 6 లో అమలు చేస్తామని అన్నారు. రుషికొండపై రూ.500 కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టుకున్నాడని, ఆ ప్యాలెస్ ను ఏం చేయాలనే విషయమై ఆలోచించి ఒక సముచితమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు.