ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క సీఎం చంద్రబాబు తన అనుభవంతో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ అమరావతి రాజధాని డెవలప్మెంట్ పై ఫోకస్ పెట్టారు. మరోవైపు, యువ నేత, మంత్రి లోకేశ్ తండ్రి బాటలో నడుస్తూ రాష్ట్రాభివృద్ధిపై నవతరం ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో సీబీజీ ప్లాంట్ కు లోకేశ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పై లోకేశ్ విరుచుకుపడ్డారు.
గత ఐదేళ్లలో ఏపీలో విధ్వంసం జరిగిందని, వాటాలివ్వలేదని పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన కంపెనీలను తరిమేశారని లోకేశ్ ఆరోపించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్టుల గురించి చెప్పమని పులివెందుల ఎమ్మెల్యేకు సవాల్ చేశానని, కానీ జగన్ నుంచి సౌండ్ లేదని సెటైర్లు వేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చామని, తమ బ్రాండ్ సిబిఎన్ అని గర్వంగా చెబుతానని అన్నారు. 2024 ఎన్నికల్లో సైకో పాలనకు ప్రజలు బై బై చెప్పారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి అనేక కంపెనీలు రాబోతున్నాయని, అంబానీలతో చంద్రబాబుకు సత్సంబంధాలున్నాయని గుర్తు చేశారు. కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏపీలో పెట్టేందుకు రిలయన్స్ ముందుకు వచ్చిందన్నారు. ఏపీ అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో పాటు స్పీడ్ ఆఫ్ బిజినెస్ అని నిరూపిస్తామని అన్నారు. మొదటి సీబీజీ ప్లాంట్ కనిగిరిలో నిర్మిస్తున్నామని, దీని ద్వారా ఏపీలో 2.50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. కనిగిరిలో యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన మొదటి హామీని నిలబెట్టుకున్నానని అన్నారు.
ఇక, వైసీపీ పరిస్థితి చూస్తే జాలేస్తుందని, వాళ్లు పని చేయరని.. ఇంకొకరు పనిచేస్తే చేయనివ్వరని ఎద్దేవా చేశారు. సీబీజీ ప్లాంట్‌కు వైసీపీ నాయకులు అడ్డుపడొద్దని లోకేష్ హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ పేర్లు రెడ్ బుక్‌లోకి ఎక్కుతాయని వార్నింగ్ ఇచ్చారు. సైకో పాలనకు టీడీపీ భయపడదని, తగ్గేదే లే అని ఆనాడే చెప్పామని గుర్తు చేశారు. త్వరలో త్రిబుల్ ఐటీకి శంకుస్థాపన చేస్తానని లోకేశ్ అన్నారు.