పేదల కడుపు నింపుతున్న అన్న క్యాంటీన్ లను వైసీపీ పాలనలో నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇచ్చిన మాట ప్రకారం ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించారు. దీంతో, ఎన్డీఏ ప్రభుత్వంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ప్రభుత్వం మారగానే తాము మూడు పూటలా భోజనం చేయగలుగుతున్నామని, జగన్ హయాంలో మాదిరిగా పస్తులు ఉండాల్సిన అవసరం లేదని పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే గత వైసిపి ప్రభుత్వం పై విమర్శలు కూడా చేస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి మంచిపేరు రావడం ఓర్వలేని వైసీపీ నేతలు తాజాగా అన్నా క్యాంటీన్లపై విష ప్రచారం మొదలుపెట్టారు. తణుకు అన్న క్యాంటీన్ నిర్వహణ సరిగా లేదంటూ వైసిపి సోషల్ మీడియా విభాగం చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు. పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని లోకేష్ మండిపడ్డారు.
అన్న క్యాంటీన్లో రుచితో పాటు సుచీ శుభ్రతలకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. చేతులు కడిగే స్థలం అని రాసి ఉన్నప్పటికీ తమ ప్రభుత్వంపై బురదజల్లేందుకే సింకులో అన్నం ప్లేట్లను వైసిపి మూకలు పడేశాయని ఆరోపించారు. అంతేకాకుండా, అలా పడేసిన ప్లేట్లను వీడియో తీసి వైరల్ చేసే సునకానందం పొందుతున్నాయని, ఫేక్ ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేతలపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.