టీడీపీ యువ నేత, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాలనలో తన మార్క్ చూపిస్తోన్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఓ రైతు తన వ్యవసాయ బోరుకు విద్యుత్ కనెక్షన్ విషయంలో సాయం చేయాలని గ్రీవెన్స్ లో మంత్రికి విన్నవించారు. ఇంత చిన్న విషయమే కదా అని వదిలేయకుండా మంత్రి కొండపల్లి చూపించిన చొరవతో ఆ రైతు సమస్య పరిష్కారమైంది. ఆ విద్యుత్ కనెక్షన్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యం అనుకున్న ఆ రైతుకు కొండపల్లి అండగా నిలిచారు. దీంతో, తన పొలంలో కొండపల్లి, చంద్రబాబు ఫొటోలు పెట్టి జలాభిషేకం చేసి బోరు ఆన్ చేశారు ఆ రైతు. ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం శ్రమిస్తున్న యువ మంత్రి కొండపల్లికి సీఎం చంద్రబాబు మరో కీలక బాధ్యత అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్స్ ఆఫ్ తెలుగు సొసైటీ (ఏపీఎన్నార్టీఎస్) అధ్యక్షుడిగా కొండపల్లిని చంద్రబాబు సర్కార్ నియమించింది. ఈ ప్రకారం ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాలో ఎన్నారైలకు సంబంధించిన వ్యవహారాలను ఏపీఎన్నార్టీఎస్ చూసుకుంటుంది. టీడీపీ హయాంలో ఈ సంస్థ గతంలో ఏర్పాటైంది. విదేశాల్లోని తెలుగు ప్రజల సమస్యలను, దౌత్యపరమైన ఇబ్బందులను తెలుసుకొని పరిష్కరించడమే దీని లక్ష్యం.
2024 ఎన్నికల్లో విజయనగరం జిల్లా గజపతి నగరం ఎమ్మెల్యేగా కొండపల్లి గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన కొండపల్లిని చంద్రబాబు గుర్తించి మంత్రి పదవి ఇచ్చారు. అమెరికాలోని ఒరాకిల్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా అపార అనుభవం ఉన్న కొండపల్లి ఆ తర్వాత ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా అమెరికాలో రాణించారు. తన ప్రాంత ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఏపీఎన్నార్టీఎస్ వ్యవహారాలు చూసుకునేందుకు కొండపల్లి సరైన వ్యక్తి అని చంద్రబాబు భావించారు.
అమెరికాతోపాటు అరబ్ దేశాలలోనూ ఆయన పనిచేశారు. దీంతో, విదేశాలలో ఎన్నారైలకు ఎటువంటి ఉద్యోగ, వ్యాపార అవకాశాలున్నాయి అనే విషయాలపై కొండపల్లికి మంచి అవగాహన, పట్టు ఉన్నాయి. ఈ క్రమంలోనే కొండపల్లిని చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు ఏపీఎన్నార్టీఎస్ అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంలో ఎన్నారైలు కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఓటు వేసి కూటమిని గెలిపించేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి మరీ ఏపీకి ఎన్నారైలు పోటెత్తారు. ఈ క్రమంలోనే ఏపీ ఎన్నారైల సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు పెద్ద పీట వేశారు.