వైసీపీ హయాంలో అక్రమ రేషన్ ధందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిందని ఆరోపణలు వస్తోన్న సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు కేంద్రంగా అంతర్జాతీయ అక్రమ రేషన్ బియ్యం మాఫియా కొనసాగిందని టీడీపీ, జనసేన నేతలు చాలాకాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన సతీమణి పేర్లు కూడా రేషన్ బియ్యం మిస్సింగ్ వ్యవహారంలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు.
పేదల రేషన్ బియ్యం కొట్టేసిన పేర్ని నానిని పందికొక్కులా చూడాలంటూ రవీంద్ర షాకింగ్ కామెంట్లు చేశారు. తప్పుడు పనులు చేసి డబ్బులు కట్టినంత మాత్రాన పేర్ని నాని దొర కాడని, దొంగేనని అన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, ఈ కుంభకోణంపై సిట్ ఏర్పాటుకు సిఫారసు చేస్తానని చెప్పారు. అయితే, కక్ష సాధింపులకు పాల్పడాల్సిన పని తనకు లేదని, అలా అయితే పేర్ని నాని కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపేవాళ్లమని అన్నారు. దారి మళ్లిన బియ్యంపై వివరణ ఇవ్వలేని దుస్థితిలో నాని ఉన్నారని, తప్పు చేయనప్పుడు దొంగలా తప్పించుకు తిరగడం ఎందుకని సెటైర్లు వేశారు.
ఇక, పేర్ని నానికి సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు రవీంద్ర వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పదేపదే నీతులు వల్లించే పేర్ని నాని ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారని నిలదీశారు.