రాజకీయాల్లో బొత్తగా సహనం తగ్గిపోయింది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేవారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇవాల్టి రోజున సోషల్ మీడియా జోరు పెరిగిపోయి.. నోరు జారిన ఒక్క మాటను పట్టుకొని పెద్ద ఎత్తున వీడియోలు.. మీమ్స్ తో వైరల్ చేస్తున్నారు. అయినప్పటికి.. తమ ఆవేశాన్ని ఏ మాత్రం తగ్గించుకోకుండా.. తమను ప్రశ్నిస్తున్న వారిని మాటలతో కడిగేస్తున్నారు నేతలు. తాజాగా అలాంటి పనే చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్.
నువ్వానేనా అన్నట్లు సాగుతున్న సాగర్ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఒక ఉదంతం మంత్రి జగదీశ్ కు బోలెడంత కోపం వచ్చేలా చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన ఉద్యోగాల భర్తీ.. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రచారానికి వచ్చిన మంత్రిని పట్టుకొని అడిగేశాడు అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన అకోశ్ రెడ్డి.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన తనను ఉద్దేశించి ప్రశ్నించటమా? అన్న ఆగ్రహానికి గురైన మంత్రి జగదీశ్ నోటికి పని చెప్పారు. ‘నిన్ను.. నీ నాయకుడ్ని తొక్కిపడేస్తా. నీలాంటి కుక్కల్ని చాలామందిని చూశా’ అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో.. కల్పించుకున్న పోలీసులు.. ఆ యువకుడ్ని పక్కకు తీసుకెళ్లి పంపించేశారు.
ఇంతకీ మంత్రిని ప్రశ్నించిన యువకుడు ఎమ్మెస్సీ చేసి.. ప్రైవేటు పాఠశాలలో టీచర్ గా పని చేస్తున్నాడు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికి వచ్చిన అతడు.. పొలం పనులు చేసుకుంటున్నాడు. ప్రశ్నించే గొంతుల్ని ఇలా మాటలు అనేసి తొక్కేస్తే విధానం పార్టీకి చేసే నష్టం భారీగా ఉంటుందన్న మాట వినిపిస్తోంది. అయినా.. మంత్రిస్థానంలో ఉండి ఇలా నోరు జారటం ఏమిటి జగదీశా?