‘వైసీపీకి ఓట్లేసి గెలిపించకపోతే మహిళలకు, ఇతరులకు సంక్షేమ పథకాలు అందవు’ ఇవి తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన హెచ్చరిక. మంత్రి చేసింది హెచ్చరికా లేకపోతే బెదిరింపా అన్నదే అర్ధంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఈ పథకాలన్నింటినీ నిలిపేస్తాయని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇవ్వని విధంగా తమ ప్రభుత్వం పథకాలను అమలుచేస్తోందన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం ఇల్లాళ్ళను శక్తివంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
ఈ పథకాలు ఆగకుండా కంటిన్యు అవ్వాలంటే మళ్ళీ మహిళలంతా తమ పార్టీకే ఓట్లేయాలని ధర్మాన కోరారు. వైఎస్సార్ ఆసరా మూడో విడత కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. తమకు ఓట్లేసి గెలిపించకపోతే అక్క, చెల్లెమలకు సహాయం చేయటం అనవసరమనే వాదన జనాల్లోకి వెళ్ళిపోతుందన్నారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఇన్ని పథకాలు అమలుచేస్తున్నాం కాబట్టి తమకు ఓట్లేయమని అడగటంలోతప్పులేదు.
కానీ ఓట్లేయకపోతే పథకాలు ఆగిపోతాయని చెప్పటమే బావోలేదు. ఎందుకంటే ప్రభుత్వం ఇన్ని పథకాలు అమలుచేస్తోందంటే జగన్ జేబులోని డబ్బులు ఖర్చు చేయటంలేదు. ప్రజల డబ్బే ప్రజలకు ఖర్చుచేస్తున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే జగన్ ప్లేసులో చంద్రబాబునాయుడు అయినా లేదా పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చినా సంక్షేమపథకాలను కంటిన్యు చేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఒకవేళ పథకాలను కంటిన్యు చేయకపోయినా, అడ్డదిడ్డంగా అమలుచేసినా జనాలు మళ్ళీ ఐదేళ్ళకు తమ తీర్పు ఏమిటో స్పష్టంగా చెబుతారు.
ఈ విషయాన్ని గ్రహించారు కాబట్టే చంద్రబాబు, పవన్ వివిధ సందర్భాల్లో మాట్లాడినపుడు ఈ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకన్నా మరింత ఎక్కువ పథకాలను అమలుచేస్తామని చెబుతున్నది. జనాలేమీ పిచ్చోళ్ళు కాదు ఎవరికిపడితే వాళ్ళకి ఓట్లేసి గెలిపించటానికి. తమకు ఎవరి ద్వారా మంచి జరుగుతుందని అనుకుంటారో కచ్చితంగా వాళ్ళకే ఓట్లేసి గెలిపిస్తారు. ఈ విషయం ఎన్నోసార్లు రుజువైంది. కాకపోతే ఒకపుడు ఎన్నికల యుద్ధం దాదాపుగా రెండుపార్టీల మధ్యే జరుగుతుండేది. అలాంటిది రాబోయే ఎన్నికలు మూడు లేకపోతే అంతకన్నా ఎక్కువ పార్టీల మధ్య జరగబోతోందంతే.