తాజా ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు ఎంతలా కోరుకున్నారో.. అంతకుమించి గుడివాడలో కొడాలి నాని, గన్నవరంలో వల్లభనేని వంశీ ఓడిపోవాలని కోరుకున్నారు. తెలుగుదేశం విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం ఒక ఎత్తు అయితే.. గుడివాడలో నాని, గన్నవరంలో వంశీ ఓడిపోవటం కూడా మరో ఎత్తు.. అన్నట్టుగా అంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు నియోజకవర్గాలను తీసుకున్నారు. ఎన్నికలకు ముందు ఐదారు నెలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏ తెలుగుదేశం అభిమానిని.. నాయకుడిని కదిలించినా.. గుడివాడలో కొడాలి నాని ఓడిపోవాలి.. ఇదే మా ఆశ.. కోరిక అని చెబుతూ వచ్చారు.
దీనిని బట్టి కొడాలి నానిని ఓడించాలని… గుడివాడలో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ఏ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం అభిమాని అయినా ఎంతలా కోరుకున్నారో తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని లక్షల మంది తెలుగుదేశం అభిమానులు కార్యకర్తల కోరికను నిజం చేశారు ఎన్ఆర్ఐ వెనిగండ్ల రాము. గుడివాడ నియోజకవర్గానికి చెందిన రాము గత డిసెంబర్లోనే గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా పగ్గాలు చేపట్టారు. వైసీపీలో మంత్రిగా పనిచేసే దాదాపు 25 సంవత్సరాలుగా గుడివాడను తనకు తిరుగులేని కోటగా చేసుకున్న నాని పదే పదే దమ్ముంటే తనపై చంద్రబాబు, లోకేష్ పోటీ చేయాలని సవాళ్లు రువ్వుతూ వచ్చారు.
టీడీపీ కూడా నిన్ను ఓడించడానికి చంద్రబాబు, లోకేష్ అక్కర్లేదు… గుడివాడ నియోజకవర్గానికి చెందిన సాధారణ పార్టీ అభిమాని చాలు.. ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా రాముని పోటిగా పెట్టి ఓడిస్తామని ఈసారి చాలా కసితో శపథాలు చేస్తూ వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకం ఏ మాత్రం ఒమ్ము చేయకూడదని పగడ్బందీ ప్రణాళికతో ఏడాది పాటు ప్రతిరోజు, ప్రతిక్షణం చాలా కష్టపడ్డారు. రాముకు అందుకే ఈరోజు 53 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘనవిజయం దక్కింది.
ఈ క్రమంలోనే రాముకు ఖచ్చితంగా క్యాబినెట్లో బెర్త్ ఇవ్వాలన్న డిమాండ్లు అమెరికా నుంచి అమరావతి వరకు వినిపిస్తున్నాయి. భవిష్యత్తులోనూ నాని అసెంబ్లీ గడప తొక్కకుండా చేయాలని.. ప్రతి తెలుగుదేశం కార్యకర్త కసితో ఉన్నారు. ఈ క్రమంలోనే రాముకు మంత్రి పదవి కోసం ఎన్నారైలు భారీ ఎత్తున చంద్రబాబు ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు స్వతహాగా మృదుస్వభావి అందరినీ కలుపుకుపోయే మనస్తత్వంతో పాటు.. రాము భార్య మాల సామాజిక వర్గం కావడంతో ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఎస్సీ సామాజిక వర్గాల్లోనూ పార్టీకి చాలా ప్లస్ అవుతుందని.. కచ్చితంగా రాముకు మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుపై ఎక్కువ ఒత్తిళ్లు ఉన్నట్టు తెలుస్తోంది.