ఇప్పుడున్న గొడవలు సరిపోవన్నట్లుగా కొందరు మంత్రులు కావాలనే వివాదాలతో సావాసం చేస్తున్నారా? తాజాగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో మంత్రి బాలినేని రష్యా పర్యటనకు వెళ్ళారు. అయితే, మంత్రిగారి రష్యా పర్యటన వ్యక్తిగతమా ? లేకపోతే అధికారికమా ? అన్న విషయంలో క్లారిటీ లేదు. ఇక, బాలినేని విదేశాలకు ఎలా వెళ్ళినా ఎవరికీ వచ్చే నష్టమేమీ లేదన్నది వేరే విషయం. కాకపోతే ప్రైవేటు జెట్ లో బాలినేని రష్యాకు వెళ్లిన విధానమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది.
ప్రైవేటు జెట్ లో బాలినేని రష్యా వెళ్ళారంటేనే అదేదో ప్రైవేటు విజిట్ అని అర్ధమైపోతోంది. కాకపోతే వెళ్ళే మంత్రి గుట్టుచప్పుడు కాకుండా వెళితే బాగుండేది. కానీ తాను ప్రైవేట జెట్ లో ప్రయాణిస్తున్న విషయాన్ని స్వయంగా బాలినేనే తన ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. విమానంలో తాను కూర్చుని మొబైల్ ఫోన్ చూస్తున్నపుడు ఫొటో తీయించి మరీ బాలినేని సదరు ఫొటోను పోస్టుచేసుకున్నారు.
విమానంలో తన పక్క సీటులో ఎవరు లేకపోయినా మంత్రితో పాటు ఎంతమంది వెళ్లారు అనే విషయంలో క్లారిటీ లేదు. ఇక్కడి నుండి రష్యాకు మంత్రి ఒక్కళ్ళే వెళ్ళే అవకాశం అయితే లేదు. తన సన్నిహితులతోనే కలిసి వెళ్ళుంటారన్న టాక్ వస్తోంది. మరి ప్రైవేటు జెట్ లో మంత్రి రష్యాకు ఎందుకు వెళ్ళారన్నదే సస్పెన్సుగా మారింది. ఇఖ, మంత్రి స్వయంగా ట్విట్టర్లో ఫొటోను పోస్టు చేసిన తన రష్యా టూర్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హవాలా కింగ్ బాలినేని ప్రైవేట్ జెట్ లో రష్యా పర్యటన అంటూ టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హవాలా డబ్బు సంపాదనలో కింగ్ అయిపోయిన బాలినేని ఆ డబ్బుతోనే ఇఫుడు ప్రైవేటు జెట్ లో రష్యాకు వెళ్ళారని సెటైర్లు వేస్తున్నారు. వ్యక్తిగత ఫ్లైట్లో రష్యాకు వెళ్ళాలంటే సుమారు రు. 5 కోట్లవుతుందని, సొంత పర్యటనకు అంత భారీ మొత్తం ఖర్చు పెట్టుకుని మంత్రి రష్యాకు ఎందుకు వెళ్ళాల్సొచ్చిందని విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి బాలినేని ఫొటో పెట్టి తనపై విమర్శలకు తానే కారణమయ్యారన్న టాక్ వస్తోంది.