ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో కుల రాజకీయాలు ఎక్కువన్న వాదన చాలాకాలంగా ఉంది. ఏపీలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల మధ్య ఎన్నో ఏళ్లుగా రాజకీయపరమైన పోరు నడుస్తోందన్న అభిప్రాయం జనాల్లో ఉంది. ఈ క్రమంలోనే ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా వస్తున్నాయి.
ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్…టీడీపీ హయాంలో చంద్రబాబు కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికే అత్యున్నత పదవులు కట్టబెట్టారని విమర్శలు చేశారు. ఇక, చంద్రబాబు సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసిన జగన్…ఆ క్రమంలోనే అమరావతిని ఒక కులానికి పరిమితం చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. తన సామాజిక వర్గం వారికి అనుకూలంగా అమరావతిని రాజధానిగా చంద్రబాబు రూపొందించారని, అందుకే తాను దీన్ని వ్యతిరేకిస్తున్నట్లు జగన్ చెప్పడం తెలిసిందే. కొందరి కోసం కాకుండా అందరికోసం రాజధాని ఉండాలనే 3 రాజధానుల ప్రతిపాదన తెచ్చామంటూ జగన్ సమర్థించుకున్నారు.
ఈ క్రమంలోనే జగన్ ను అనుసరిస్తున్న వైసీపీ నేతలు కూడా అదే బాటలో వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అమరావతిపై హైకోర్టు తీర్పు జీర్ణించుకోలేని మంత్రి అప్పలరాజు…అమరావతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అమరావతి కాదని, కమ్మరావతని విషం కక్కారు. 3 రాజధానులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ఉత్తరాంధ్రకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అధికార వికేంద్రీకరణ, మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, దీనిపై సీఎం జగన్ ముందుకెళతారని ధీమా వ్యక్తం చేశారు.