ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి అప్పలరాజు నిత్యం తన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో సీఎం జగన్ రాక సందర్భంగా శారదాపీఠంలోకి మంత్రి అప్పలరాజు వెళ్తుండగా పోలీసులు అడ్డుకోగా…వారిపై అమాత్యులు అప్పలరాజు చిందులు వేశారు. ప్రొటోకాల్ ప్రకారం మంత్రికి మాత్రమే అనుమతి ఉందని, ఆయన ఒక్కరే లోపలకు వెళ్లాలని పోలీసులు సూచించచడంతో వారిపై వీరంగం వేశారు. మంత్రి అనుచరులను లోపలకు పంపించబోమని ఒక సీఐ స్పష్టం చేయడంతో..ఆయనపై మంత్రి అప్పలరాజు బూతు పురాణం విప్పారని ప్రచారం జరిగింది.
అయితే, ఎస్ఐ బూతులు తిట్టారంటూ మంత్రి అనుచరులు ప్రచారం చేశారు. కానీ, అసలు పోలీసులను బూతులు తిట్టింది మంత్రి అప్పలరాజేనని ఆరోపణలు వచ్చాయి. ఆ ఘటనలో మంత్రి అప్పలరాజు తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ ఘటన తర్వాత అప్పలరాజుకు సీఎం క్లాస్ పీకారని కూడా పుకార్లు వచ్చాయి. అయితే, ఆ ఘటన తర్వాత కూడా అప్పలరాజు తీరు మారినట్లు కనిపించడం లేదు.
తాజాగా శారదా పీఠం ఘటన మాదిరిగానే తిరుమలలో అప్పలరాజు తన అధికార దర్పంతో హల్ చల్ చేశారు. తన అనుచరులు 150 మందితో ఆయన తిరుమలకు వెళ్లి…150 మందికి కూడా ప్రొటోకాల్ దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి చేశారు. అయితే, వీవీఐపీలకు మాత్రమే ప్రొటోకాల్ ప్రకారం స్వామివారి దర్శనం కల్పిస్తారని అధికారులు చెప్పారు. దీంతో, మంత్రిగారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అందరినీ అనుమతించాలని పట్టుబట్టారట.
అయితే, అలా కుదరదని చెప్పడంతో చివరకు తగ్గిన మంత్రి అధికారులు చెప్పినట్లు చేయక తప్పలేదట. మంత్రి ఒత్తిడితో 20 మందికి ప్రొటోకాల్ దర్శనం కల్పించారు అధికారులు. మిగిలిన వారికి బ్రేక్ దర్శనం కల్పించారు. అయితే, 150 మందితో స్వామివారి దర్శనానికి వచ్చానని… తాను కూడా సామాన్య భక్తుడి మాదిరే క్యూలైన్ లో వెళ్లి స్వామిని దర్శించుకున్నానని అప్పలరాజు చెప్పడం కొసమెరుపు. ప్రొటోకాల్ దర్శనం కోసం తాను ఒత్తిడి తీసుకురాలేదని, అధికార హోదాను ప్రదర్శించలేదని వివరణనిచ్చే ప్రయత్నం చేశారు.
Comments 1