అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్కపిల్ల, కాదేదీ కవితకనర్హం అని మహాకవి శ్రీశ్రీ చెప్పారు. అయితే, మైనింగ్, మట్టి, ఇసుక ఏదైనా సరే దోపిడీకి కాదు అనర్హం అని వైసీపీ నేతలు అంటున్నారు. సీఎం జగన్ పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు దోపిడీకి పాల్పడుతున్నారని, కోట్ల రూపాయలు దండుకుంటున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, వైసీపీ నేతల మైనింగ్ మాఫియాను, ఇసుక మాఫియాను బట్టబయలు చేసేందుకు వెళ్లిన దేవినేని ఉమా వంటి వారిని పోలీసులు అరెస్టు చేసి ఇబ్బంది పెట్టడంపై కూడా వారు మండిపడుతున్నారు.
ఎవరెన్ని విమర్శలు చేసినా సరే అధికారం ఉంది అన్న ధీమాతో వైసీపీ నేతలు మైనింగ్, ఇసుక, మట్టి మాఫియా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేతలపై టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జగన్ సొంత జిల్లా కడపను వైసీపీ నేతలు మాఫియా కేంద్రంగా మార్చారని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జిల్లావ్యాప్తంగా మైనింగ్, మట్టి, ఇసుక దోపిడీకి గురవుతోందని, ఆ దోపిడీ ద్వారా అధికార పార్టీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు భరత్ రెడ్డి కొండలను కరిగిస్తూ మైనింగ్ మాఫియాకు పాల్పడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. కడప శివారులో అక్రమ మైనింగ్ జరుగుతోందని, ఆ మైనింగ్ మాఫియాపై టీడీపీ ఫిర్యాదు చేసింది అని గుర్తు చేశారు. ఎంత మేరకు మట్టిని తవ్వారు అనే విషయంపై మైనింగ్ అధికారులు సర్వే చేయలేదని ఆయన ఆరోపించారు. ఏదో నామమాత్రంగా సర్వే చేసి రెండు కోట్ల రూపాయల పెనాల్టీ వేసి వదిలేశారని ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.
అయితే పక్కాగా సర్వే చేస్తే కనీసం పది కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని, ఆ ఆదాయానికి వైసీపీ నేతలు గండి కొట్టినట్టు అయిందని శ్రీనివాస రెడ్డి అన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంటే మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు.