వైసీపీ పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో దాడిని కొనసాగిస్తున్నారు. `రా..కదలిరా!` పేరిట నిర్వహిస్తున్న సభల్లో ఉదయం, సాయంత్రం ఆయన వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా ఆయన పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. సోమవారం ఉదయం రాజమండ్రిలో ప్రభుత్వ విధానాలను ఎండగట్టిన చంద్రబాబు.. సాయంత్రం.. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం లోని చేబ్రోలులో నిర్వహించిన రా..కదలిరా! సభలో పాల్గొని మరింతగా విమర్శలు గుప్పించారు. తన ప్రసంగంలో అడుగడుగునా సీఎం జగన్పై సటైర్లు వేస్తూ.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించేలా చేశారు.
“జగన్ పాయిజన్.. నేను విజన్.. ఆ భస్మాసురుడు.. నా వయసు అడుగుతున్నాడు. నేను వయసును చూడను. విజ్ఞానాన్ని చూస్తాను. నువ్వు నీ కుటుంబం ఆస్తులుపెంచుకునేందుకు పాలన చేస్తున్నావు. కానీ, నేను ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల అభివృద్ధి, రాష్ట్ర భవిష్యత్తు కోసం తపిస్తున్నాను. నా విజన్ నీకు ఉందా? ముందు అది చెప్పు. కానీ, ఆయన చెప్పలేడు. ఎందుకంటే.. ఆయన ఆలోచనలను, పాలన అంతా పాయిజన్. ఎవరైనా దానికి బలి అయిపోవాల్సిందే“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
“రాష్ట్రంలో జగన్ మార్క్ అంట! ఇప్పుడు ఇదో కొత్త పల్లవి అందుకున్నాడు. ఏంటయ్యా.. నీ మార్క్? కరెంటు బిల్లుల 9 సార్లు పెంచడమా? ప్రతిపక్షాలపై కేసులు పెట్టడమా? సంస్థలను అమ్మేయడమా? రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడమా? చెప్పు. టీడీపీ పాలనలో గంజాయి లేకుండా చేసే ప్రయత్నం చేశాం. కానీ, ఇప్పుడు జగన్ మార్క్ అంట.. చిన్న పిల్లలకు కూడా గంజాయి చేరువ చేశారు. అభివృద్దిలో ఏపీని నెంబర్ 1 చేశా. కానీ, ఇప్పుడు అవినీతి, అక్రమాల్లో ఏపీని నెంబర్ 1 చేశాడు. ఇదేనా జగన్ మార్క్.. చెప్పు జగన్ రెడ్డీ!“ అని చంద్రబాబు ప్రశ్నించారు.
టీడీపీ-జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు. అంతేకాదు.. తమ ప్రభుత్వం రాగానే వడివడిగా అమరా వతిని పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. `రైతులు కన్నీళ్లు పెట్టుకున్నా.. ఈ సైకో సీఎంకు మనసు కరగలేదు. రాజధానిని నాశనం చేశాడు. మా హయాంలో కట్టించిన టిడ్కో ఇళ్లకు తన పార్టీ రంగులు వేసుకున్నాడు. పోనీ.. అవైనా ఇచ్చాడా అంటే.. అదీ లేదు. ఎక్కడో శ్మశానాల్లో గజం స్థలం ఇచ్చి.. అక్కడ ఉండమని ప్రజలకు చెబుతున్నాడు. ఈయన మాత్రం.. సముద్ర తీరంలో రుషికొండను బోడిగుండు చేసి అక్కడ 500 కోట్లతో విల్లా కట్టుకుని అక్కడే ఉంటాడట. ఇదీ.. జగన్ మార్క్“ అని చంద్రబాబు దుయ్యబట్టారు.