చిన్నప్పుడు
ఏ పండక్కో..పబ్బానికో
కొత్త గౌను కుట్టిస్తే..
ఎంత ఆనందమో…
ఎప్పుడు పండగ
వస్తుందా, ఎప్పుడు
వేసేసుకుందామా
అన్న ఆతృతే…
ఇంటికి చుట్టాలొచ్చి
వెళ్తో వెళ్తూ.. చేతిలో
రూపాయో… అర్ధ
రూపాయో పెడితే
ఎంత వెర్రి ఆనందమో…
చుట్టాలొచ్చి వెళ్లిపోతుంటే
దుఃఖం తన్నుకు వచ్చేది…
ఇంకా ఉంటే బాగుండు
అన్న ఆశ…
ఎంత ఆప్యాయతలో…
సినిమా వచ్చిన ఏ
పదిహేను రోజులకో
ఎంతో ప్లాన్ చేసి
ఇంట్లో ఒప్పించి
అందరం కలిసి
నడిచి వెళ్లి..
బెంచీ టికెట్
కొనుక్కుని సినిమా
చూస్తే ఎంత ఆనందమో…
ఇంటికొచ్చాకా ఒక గంటవరకూ
ఆ సినిమా కబుర్లే…
మర్నాడు స్కూల్ లో
కూడా…
ఆ ఆనందం ఇంకో పది
రోజులుండేది…
అసలు రేడియో విచిత్రం..
అందులోకి మనుషులు
వెళ్లి మాట్లాడతారా అన్న
ఆశ్చర్యం…అమాయకత్వం..
పక్కింట్లో వాళ్లకి రేడియో
ఉంటే..ఆదివారం
మధ్యాహ్నం వాళ్ళ గుమ్మం
ముందు కూర్చుని
రేడియో లో సంక్షిప్త
శబ్ద చిత్రం (ఒక గంట కి
కుదించిన) సినిమాని
వింటే ఎంత ఆనందం…
మనింట్లో కూడా రేడియో
ఉంటే…అన్న ఆశ…
కాలక్షేపానికి లోటే లేదు…
స్నేహితులు
కబుర్లు, కధలు
చందమామలు
బాలమిత్రలు…
సెలవుల్లో మైలు దూరం
నడిచి లైబ్రరీ కి వెళ్లి
గంటలు గంటలు
కథల పుస్తకాలు
చదివి ఎగురుకుంటూ
ఇంటికి రావడం….
సర్కస్ లు,
తోలు బొమ్మలాటలు
లక్కపిడతలాటలు…
దాగుడు మూతలు…
చింత పిక్కలు
వైకుంఠ పాళీ
పచ్చీసు..
తొక్కుడు బిళ్ళలు..
ఎన్ని ఆటలో…
మూడు గదుల రైలుపెట్టి
లాంటి ఇంట్లో అంతమంది
ఎంత సంతోషంగా ఉన్నాం…
వరుసగా కింద చాపేసుకుని
పడుకున్నా ఎంత హాయిగా
సర్వం మరిచి నిద్రపోయాం…
అన్నంలో కందిపొడి..
ఉల్లిపాయ పులుసు
వేసుకుని తింటే
ఏమి రుచి…
కూర అవసరమే లేదు..
ఇంట్లో, చిన్నా చితకా
షాపింగ్ అంతా నేనే…
అన్నీ కొన్నాకా షాప్
అతను చేతిలో గుప్పెడు
పుట్నాల పప్పో, పటికబెల్లం
ముక్కో పెడితే ఎంత
సంతోషం…
ఎంత బరువైనా
మోసేసేదాన్ని…
కొత్త రిబ్బన్లు కొంటే
ఆనందం…చుక్కలా
ఎగురుతున్న విమానం
కింద నుండి
కళ్ళకు చెయ్యి అడ్డం
పెట్టి చూస్తే ఆనందం…
తీర్థం లో ముప్పావలా
పెట్టి కొన్న ముత్యాల
దండ చూసి మురిసి
ముక్కలవడం…
కొత్త పుస్తకం కొంటే
ఆనందం…వాసన
చూసి మురిపెం..
కొత్త పెన్సిల్ కొంటే
ఆనందం…
రిక్షా ఎక్కితే…
రెండు పైసల
ఇసుఫ్రూట్ తింటే
ఎంత ఆనందం..?
రిక్షా ఎక్కినంత తేలికగా…
ఇప్పుడు విమానాల్లో
తిరుగుతున్నాం…
మల్టీప్లెక్స్ లో ఐమాక్స్
లో సినిమా చూస్తున్నాం.
ఇంటర్వెల్ లో
ఐస్ క్రీం తింటున్నాం..
బీరువా తెరిస్తే మీద పడి
పోయేటన్ని బట్టలు…
చేతినిండా డబ్బు…
మెడలో ఆరు తులాల
నగ…
పెద్ద పెద్ద ఇళ్ళు, కార్లు…
ఇంట్లో పెద్ద పెద్ద టీవీలు…
హోమ్ థియేటర్లు…
సౌండ్ సిస్టమ్స్, అరచేతిలో
ఫోన్లు…అరచేతిలో
స్వర్గాలు…
అనుకోవాలే గానీ క్షణంలో
మన ముందు ఉండే
తిను బండారాలు..
సౌకర్యాలు…
అయినా చిన్నప్పుడు
పొందిన ఆ ఆనందం
పొందలేకపోతున్నాం
ఎందుకు నేస్తం…?
ఎందుకు…?ఎందుకు…?
చిన్నప్పుడు కోరుకున్నవి
అన్నీ ఇప్పుడు
పొందాము కదా…
మరి ఆనందం లేదేం…
ఎందుకంత మృగ్యం
అయిపోయింది…
ఎండమావి
అయిపోయింది..
మార్పు ఎందులో…?
మనలోనా…?
మనసుల్లోనా…?
కాలంలోనా…?
పరిసరాల్లోనా…?
ఎందులో… ఎందులో…?
ఎందులో నేస్తం…?
చెప్పవా తెలిస్తే….!!