ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఐదేళ్ల కిందట రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘కల్కి’ సినిమా సోషల్ మీడియాను ఊపేస్తోంది. పాత ‘కల్కి’ నిర్మాతలే రిలీజ్ చేస్తున్నారా లేక వారి నుంచి డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకుని ఎవరైనా చేస్తున్నారా అన్నది తెలియదు కానీ.. కొత్త ‘కల్కి’ రిలీజవుతున్న టైంలోనే పాత ‘కల్కి’ని విడుదల చేయడానికి నిర్ణయించారు.
ఐతే ప్రభాస్ అభిమానులకు ఈ విషయం తెలియక కొన్ని థియేటర్లలో రాజశేఖర్ ‘కల్కి’ టికెట్లను బుక్ చేసి హౌస్ ఫుల్ చేసేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం బయటికి రాగానే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిన్నట్నుంచి ఈ వ్యవహారం మీద మీమ్స్ ఫెస్టివల్ నడుస్తోంది.
ప్రభాస్ కల్కి అనుకుని.. రాజశేఖర్ కల్కికి టికెట్లు బుక్ చేసిన వారి పరిస్థితి ఏంటనే దానిపై మీమర్స్, ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. రకరకాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను ముంచెత్తుతున్నాయి. అందులో ‘దుబాయ్ శీను’లో రవితేజ అండ్ కో వేణు మాధవ్ చేతిలో మోసపోయి ట్రావెల్ ఏజెంట్ దగ్గరికెళ్లి బిల్డప్ ఇచ్చి.. ఆ తర్వాత మోసపోయామని తెలుసుకుని అవాక్కయ్యే సన్నివేశానికి ‘కల్కి’ టికెట్ల వ్యవహారానికి ముడిపెడుతూ చేసిన మీమ్ వీడియో హైలైట్ అని చెప్పాలి.
ఇంకా ఇలాంటి మీమ్స్ బోలెడన్ని సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. రాజశేఖర్, ప్రభాస్ ఒకే తరహాలో లుక్‌లో కనిపిస్తున్న ఫొటోలు పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్కు కారణమిదే అంటూ ఎవరో పోస్ట్ పెడితే.. దానికి రాజశేఖర్ తనయురాలు శివాని కూడా సరదాగా స్పందించడం విశేషం. మరోవైపు రాజశేఖర్ సైతం ఈ ఇష్యూతో తనకేం సంబంధం లేదంటూ కామెంట్ చేయడం గమనార్హం.