ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పై వైసీపీ అధిష్టానం వేటు వేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే సీఎం జగన్ పై, వైసీపీ నేతలపై మేకపాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఇవ్వనని జగన్ మొహం మీద చెప్పేశారని తాజాగా మరోసారి ఆయన షాకింగ్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమైంది.
కడప జిల్లా బద్వేల్ లో యువగళం పాదయాత్ర చేస్తున్న నారా లోకేష్ తో మేకపాటి ఈరోజు భేటీ అయ్యారు. లోకేష్ పాదయాత్రకు సంఘీభావం ప్రకటించిన మేకపాటి త్వరలోనే టీడీపీలో చేరబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు టీడీపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తనతో పాటు మరో ఇద్దరు నెల్లూరు జిల్లా నేతలు కూడా టీడీపీలో చేరబోతున్నారని మేకపాటి అన్నారు.
ఉదయగిరిలో జరగబోయే లోకేష్ పాదయాత్రను దిగ్విజయం చేస్తానని మేకపాటి అన్నారు. టికెట్ కోసం జగన్ ను ఐదు సార్లు కలిశానని, ఎమ్మెల్సీ పదవి మాత్రం ఇస్తానని ముఖాన ఉమ్మేసినట్టు చెప్పారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి నుంచి టికెట్ ఇస్తే పోటీ చేస్తానని, టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తానని అన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో తాను, వెంకటగిరిలో ఆనం రమణరెడ్డి…లోకేష్ పాదయాత్రను విజయవంతం చేస్తామని చెప్పారు.