గడిచిన ఏడాదిలో (2022-23) దేశంలోని రాజకీయ పార్టీలకు అత్యధికంగా విరాళాలు అందించిన కార్పొరేట్ సంస్థగా మేఘా నిలిచింది. హైదరాబాద్ కు చెందిన మెఘా ఇంజినీరింగ్ సంస్థకు అధినేత మేఘా క్రిష్ణారెడ్డి అన్న విషయం తెలిసిందే. పార్టీ ఏదైనా.. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లోని కీలక ప్రాజెక్టుల్ని దక్కించుకునే విషయంలో మంచి ట్రాక్ రికార్డు ఉన్న మేఘా సంస్థ.. రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల మొత్తం రూ.87 కోట్లుగా పేర్కొన్నారు. మేఘా సంస్థ తర్వాత సీరమ్ ఇన్ స్టిట్యూట్ నిలిచింది.
ఈ సంస్థ రూ.50.25 కోట్ల విరాళాన్ని ఇవ్వగా.. తర్వాతి స్థానంలో ఆర్సెలర్ మిత్తల్ నిహోన్ స్టీల్ ఇండియా నిలిచింది. వివిధ పార్టీలకు ఈ సంస్థ రూ.50కోట్ల విరాళాల్ని అందించినట్లుగాపేర్కొన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్స్ రిఫార్మ్స్ సంస్థ తన తాజా నివేదికను విడుదల చేసింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించింది. దేశంలో మొత్తం 18 రిజిస్టర్డ్ ఎలక్టోరల్ ట్రస్టులు ఉండగా.. వాటిల్లో 13 ట్రస్టుల వివరాలే ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో ఉన్నాయి. వాటిల్లో 8 ట్రస్టులకు ఎలాంటి విరాళాలు అందలేదు.
మిగిలిన ఐదుకు39 కార్పొరేట్ సంస్థలు.. వ్యాపార సంస్థలు కలిపి రూ.363.7 కోట్లు ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే ఫ్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టుకు రూ.360.46 కోట్ల విరాళాలు రాగా.. వాటిల్లో రూ.256.25 కోట్ల మొత్తాన్ని బీజేపీ ఇచ్చింది. అదే సంస్థ ఆమ్ ఆద్మీ పార్టీకి.. బీఆర్ఎస్.. వైసీపీలకు విరాళాల్ని అందజేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అన్ని ఎలక్టోరల్ ట్రస్టుల నుంచి అత్యధికంగా విరాళాలు పొందిన పార్టీగా బీజేపీ నిలిచింది. బీజేపీ తర్వాత అత్యధికంగా ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా విరాళాలు అందుకున్న పార్టీగా బీఆర్ఎస్ నిలిచింది.
ఆ పార్టీ రూ.90 కోట్ల మొత్తాన్ని పొందింది. ఇక.. వైసీపీ.. ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు కాంగ్రెస్ కలిపి ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా అందుకున్న విరాళాలు కేవలం రూ.17.4 కోట్లు కావటం గమనార్హం.బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఇచ్చిన వివరాల్ని చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. బీఆర్ఎస్ కు ఆ పార్టీకి చెందిన నతేల నుంచి వచ్చిన విరాళాలు భారీగా ఉండటం విశేషం. బీఆర్ఎస్ కరీంనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ .. బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర వద్దిరాజు (గాయత్రీ గ్రానైట్స్) హన్సా పవర్స్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ.. రాజపుష్ప ప్రాపర్టీస్ కలిసి ఒక్కొక్కరు రూ.10కోట్ల చొప్పున విరాళాలు అందజేశారు.
వ్యక్తుల పరంగా వచ్చిన రూ.64 కోట్లలో ఈ నలుగురి నుంచే రూ.40కోట్లు వచ్చాయని నివేదికలో వెల్లడైంది. మాజీ మంత్రి మల్లారెడ్డి (అప్పట్లో మంత్రి అనుకోండి) రూ.2.75 కోట్లు.. మల్లారెడ్డి సతీమణి కల్పన పేరుతో రూ.2.25 కోట్లు విరాళాలుగా ఇచ్చారు. వీరే కాక.. రోషిణి మినరల్స్ నుంచి రూ.5 కోట్లు చల్మెడ ఫీడ్స్ ప్రైవేటు లిమిటెడ్ (వేములవాడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన చల్మెడ నరసింహారావు) రూ.2కోట్లు.. విమలా ఫీడ్స్ నుంచి రూ.2కోట్ల చొప్పున విరాళాలు అందాయి.