మూడోవేవ్ ముంచెత్తుతోంది. దేశ వ్యాప్తంగా కేసుల మీద కేసులు పెరిగిపోతున్నాయి. మొదటి.. రెండో వేవ్ లలో పాజిటివ్ బారిన పడిన వారిలో కొందరు మూడో వేవ్ లోనూ మరోసారి కరోనా బారిన పడుతున్నారు. సామాన్యులతో పాటు.. ప్రముఖులు సైతం కరోనా బారిన రెండోసారి పడుతున్న ఉదంతాలు ఈ మధ్యన పెరుగుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆ జాబితాలో చేరారు.
తాజాగా తనకు కరోనా పాజిటివ్ గా తేలినట్లుగా చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్లుగా వెల్లడించారు. అంతేకాదు.. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా ముందస్తుగా పరీక్ష చేసుకోవాలని సూచన చేశారు. మెగాస్టార్ చిరంజీవి కొవిడ్ బారిన పడినట్లు తెలిసినంతనే.. అభిమానులు ఆయన్ను త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు.
మొదటి రెండు వేవ్ లతో పోలిస్తే మూడో వేవ్ తీవ్రత తక్కువగా ఉందని చెప్పాలి. గతంలో కొవిడ్ వేవ్ విరుచుకుపడిన వేళలో.. సెలబ్రిటీలు.. ప్రముఖులు హోం ఐసోలేషన్ లోనే ఉండిపోయేవారు. బయటకు వచ్చే వారు కాదు. కానీ.. కరోనా దీర్ఘకాలంగా కొనసాగటం.. పలు కమిట్ మెంట్లతో ప్రముఖులు..సెలబ్రిటీలు.. నటీనటులు బయటకురాక తప్పటం లేదు.
దీంతో.. ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా.. వారు ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఈ మధ్యనే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడాకరోనా పాజిటివ్ గా తేలటం.. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉండటం తెలిసిందే. ఇక.. మొదటి, రెండు వేవ్ లలో పాజిటివ్ కాని వారు సైతం మూడో వేవ్ లో పాజిటివ్ బారిన పడటం తెలిసిందే. ఏమైనా మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం.