ఏపీలో నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఏప్రిల్ తొలి వారంలోనే మెగా డీఎస్సీ ప్రకటన ఇస్తున్నట్టు తెలిపారు. తద్వారా 6 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను ఒకేసారి భర్తీ చేయను న్నామని వివరించారు. దీంతో నిరుద్యోగుల ఆశలు ఫలించినట్టేనని వ్యాఖ్యానించారు. ఇప్పటికే మెగా డీఎస్సీ ఆలస్యమైందన్న ఆయన.. వివిధ కారణాలను ఉదహరించారు. తాజాగా అమరావతి సచివాల యంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని.. వాటిని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రధానంగా గత పాలకులతో ధ్వంసమైన రాష్ట్రాన్నిపునర్నిర్మిస్తున్నట్టు చెప్పారు. దీనిలో ప్రతి జిల్లాకు ప్రధాన పాత్ర ఉందని చంద్రబాబు తెలిపారు. దానికి అనుగుణంగా కలెక్టర్లు ప్రణాళిక వేసుకుని ముందుకు సాగాలన్నారు. వచ్చే వేసవిలో ఎవరూ ఇబ్బంది పడకుండా.. కలెక్టర్లే బాధ్యత వహించాల న్నారు. మాకెందుకు.. అని ఊరుకుంటే.. తాను ఊరుకునేది లేదనితేల్చి చెప్పారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. మే నుంచి `తల్లికి వందనం` పథకాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. రూ.15000 చొప్పున తల్లుల ఖాతాల్లో వేస్తామ న్నారు. దీనికి సంబంధించి కూడా కలెక్టర్లు ప్రోయాక్టివ్‌గా పనిచేయాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్కరూ ఈ పథకానికి దూరం కాకూడదన్న లక్ష్యాన్ని ఇప్పటి నుంచే నిర్దేశించుకోవాలని సూచించారు. తర్వాత.. ఫిర్యాదులు వస్తే.. వాటి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
అదేవిధంగా ఉగాది నుంచి పీ-4 పథకాన్ని అమలు చేస్తున్నామని చంద్రబాబు చెప్పారు. సమాజంలోని పేదలను గుర్తించి వారిని పేదరికం నుంచి బయటపడేయడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు. సాయం చేసేవారిని మార్గదర్శకులుగా, సాయం పొందేవారిని బంగారు కుటుంబాలుగా పేర్కొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాల్సిన బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేదని తేల్చి చెప్పారు.