ట్రంప్ ఓటమి, బీహార్ ఎగ్జిట్ పోల్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి కాస్త భయం పట్టుకున్నట్టే ఉంది. ఒకప్పుడు పెద్దాయ అద్వానీ నమస్తే పెడితే పట్టించుకోని నరేంద్ర మోదీ ఆదివారం బిజెపి సీనియర్ నాయకుడు ఎల్.కె. అద్వానీ ఇంటికి వెళ్లి మరీ కేక్ కట్ చేసి వేడుక జరిపారు. అద్వానీకి ఇది 93 వ పుట్టినరోజు.
మోడీ బిజెపి అనుభవజ్ఞుడి పాదాలను తాకి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కేక్ కటింగ్ సమయంలో అద్వానీ, అతని కుమార్తె ప్రతిభతో కలిసి ఉన్నారు. అద్వానీ కూడా ప్రధాని మోడీకి కేక్ తినిపించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అద్వానీ సేవలను కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జె.పి.నాడ్డా కూడా అద్వానీ ఇంటికి మోడీతోపాటు వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అద్వానీ బిజెపి మేరు శిఖరం. అద్వానీ కృషి వల్లే నేడు బీజేపీ ఈ స్థాయిలో ఉన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ మోదీయే ఆయనను పక్కన పెట్టేశారు. బీజేపీ 90 లలో అధికారంలోకి రావడానికి మార్గం సుగమం చేసిన ఘనత కూడా అద్వానీదే. అలాంటి మహనీయుడి పుట్టిన రోజుకు మోదీ హాజరుకావడం గొప్ప విషయం ఏమీ కాదు.
అద్వానీ నవంబర్ 8, 1922 న కరాచీలో జన్మించారు. అప్పట్లో ఆ ప్రాంతం భారతదేశంలో ఉండేది. అద్వానీ సింధీ కుటుంబానికి చెందినవారు. విభజన తరువాత, అద్వానీ కుటుంబం భారతదేశానికి వచ్చి ముంబైలో స్థిరపడింది. తరువాత, కుటుంబం ఢిల్లీకి మారింది.