వ్యాక్సిన్ కొరత దేశ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న వేళ.. తప్పుడు గర్తింపు కార్డుతో టీకా వేయించుకున్నట్లుగా బంగారం ఫేం మీరాచోప్రాపై విమర్శలు వస్తున్నాయి. దీనికి సంబందించి ఒక గుర్తింపు కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదే విషయాన్ని ముంబయికి చెందిన బీజేపీ నేత ఒకరు సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో ఇది కాస్తా వైరల్ గా మారటమే కాదు.. ఆమె చేసిందన్న తప్పుడు పనిని నెటిజన్లు తిట్టి పోస్తున్నారు. ఇలాంటివేళ.. ఆమె రియాక్టు అయ్యారు.
తన మీద వస్తున్న విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాకు వరుసకు సోదరి అయ్యే మీరా చోప్రా.. తెలుగులో పలు సినిమాల్లో నటించినా ఆమెకు రావాల్సినంత క్రేజ్ రాలేదు.
సరైన హిట్ సినిమా ఆమె చేతిలో పడలేదు. అయినప్పటికీ ఏదో ఒక కారణంతో ఆమె తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. వ్యాక్సిన్ కోసం తప్పుడు మార్గంలో వెళ్లారన్న ఆరోపణపై ఆమె స్పందిస్తూ.. తప్పుడు గుర్తింపు కార్డును చూపించాల్సిన అవసరం తనకు లేదన్నారు.
మార్ఫింగ్ చేసిన గుర్తింపుకార్డును సోషల్ మీడియాలో పోస్టు చేశారన్నారు.వ్యాక్సిన్ కోసం మిగిలిన వారి మాదిరే తాను ఎన్నో ప్రయత్నాలు చేశానని.. తనకు తెలిసిన వారి సాయం కోరినట్లు చెప్పారు. నెల రోజులుగా వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేసి.. చివరకు రిజిస్టర్ చేసుకున్నట్లు చెప్పారు.
అందులో భాగంగా తన ఆధార్ కార్డు ఇచ్చానని.. దాన్ని మార్ఫింగ్ చేసి తప్పుడు గుర్తింపు కార్డును తయారు చేశారన్నారు.ఎవరైనా గుర్తింపుకార్డు ఇస్తే.. అందులో సదరు వ్యక్తి సంతకం ఉంటుందని.. అప్పుడు మాత్రమే చెల్లుబాటు అవుతుందని.. వైరల్ అయిన ఐడెంటిటీ కార్డు మీద తన సంతకం లేదన్న విషయాన్ని ఆమె ప్రస్తావిస్తున్నారు.
ఇలాంటి తప్పుడు చర్యల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. అయినా.. ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారో తనకు తెలుసుకోవాలని ఉందన్నారు.