కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమారుడు.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విషయంలో మీడియాలోని ఒక సెక్షన్ అంతా అతడ్ని పప్పుగా.. చేతకానివాడిగా.. ఆయన్నో వారసత్వ రాజకీయాల ప్రతినిధిగా చూస్తారే తప్పించి.. అతడిలోని ఆసక్తికర విషయాల్ని.. అతడి హీరోయిజాన్ని చాటి చెప్పేందుకు పెద్దగా ఆసక్తి చూపని సంగతి తెలిసిందే.
తాను కోరుకుంటే ప్రధానమంత్రి పదవిని ఇట్టే చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ పదవిని సొంతం చేసుకోవటానికి ఆసక్తి చూపించలేదనే చెప్పాలి. ఈ కారణంతోనే మన్మోహన్ సింగ్ పదేళ్లు ప్రధానమంత్రిగా పని చేశారని చెప్పాలి. ఇప్పుడీ విషయాలు ఎందుకంటే.. పాదయాత్ర లో ఆయన తల్లి కమ్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగే ఈ జోడో పాదయాత్రలో సోనియాగాంధీ కూడా రాహుల్ కలిసి నడిచారు. ప్రస్తుతం కర్ణాటకకు చేరుకున్న ఈ పాదయాత్రలో రాహుల్ తో కలిసి సోనియా కూడా నడిచారు. కొంత దూరం నడిచిన తర్వాత తల్లి సోనియా కాలు అడుగు వేసే విషయంలో ఇబ్బంది పడటాన్ని రాహుల్ గుర్తించారు. ఆ వెంటనే కిందకు వంగిన అతడు తన తల్లి వేసుకున్న షూకున్న లేస్ సరిగా లేవని గుర్తించారు. ఆ వెంటనే షూకున్న లేస్ ను సరిగా కట్టిన వైనానికి సంబంధించిన పొట్టి వీడియో ఒకటి వైరల్ గా మారింది.
సాధారణంగా ఇలాంటి నాటకీయ పరిణామాలు మోడీ విషయంలో జరిగి ఉంటే దానికి వచ్చే ప్రచారం ఓ రేంజ్ లో ఉండేది. కానీ.. అలాంటివి రాహుల్ విషయంలో పెద్దగా లేకపోవటం గమనార్హం. ఇటీవల కాలంలో సోనియా గాంధీ తరచూ అనారోగ్యానికి గురి కావటం తెలిసిందే. ఈ మధ్యనే కరోనా నుంచి కోలుకోవటం.. విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకురావటం తెలిసిందే.
కొడుకు చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న ఆమె.. కొడుకుతో పాటు కలిసి నడవటం.. ఆ సందర్భంగా అమ్మను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న తీరు.. ఆమె చెయ్యిని పట్టి నడుస్తూ చాలాసేపు మాట్లాడిన వైనం చూస్తే.. తల్లిని ఒక బాధ్యత కలిగిన కొడుకు చూసుకునేలా రాహుల్ తీరు ఉందని చెప్పాలి. మీడియా పట్టించుకోకపోయినా సోషల్ మీడియా దీనిని బానే పట్టించుకుంది. మీడియాలో పెద్దగా కనిపించకపోవటానికి కారణం.. మోడీ అండ్ కో ఇన్ ఫ్లూయిన్స్ లో ఉండటమేనని చెబుతున్నారు. ఏమైనా తాజా ఎపిసోడ్ కు సంబంధించి తోపు కొడుకుగా రాహుల్ ను మెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.