వ్యవస్థలను కాపాడకుంటూ.. వాటిని తమకు అనుకూలంగా మార్చుకోవడం లేదా.. వాటికి అనుకూలంగా తాము మారడం అనేది రాజకీయాల్లో అత్యంత అవసరం. లేకపోతే.. అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉం టుంది. ఈ విషయం తెలిసే.. రాజకీయ ఉద్ధండులు సైతం ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలుసుకుని.. ఆయా పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేస్తారు. కానీ, ఘనత వహించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం.. మడమ తిప్పేదేలేదని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు.. సీఎం జగన్.. న్యాయవ్యవస్థపై చేసిన ఆరోపణలు, నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తికే కళంకాన్ని అంటగట్టేలా చేస్తున్న ప్రయత్నాలపై యావత్ దేశం విస్తు పోతోంది.
ఎవరితో అయినా పెట్టుకోవచ్చు.. న్యాయవ్యవస్థతో వద్దు సార్. పైగా వివిధ కేసులున్న మీలాంటి వారు మరింత అప్రమత్తంగా న్యాయవ్యవస్థకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది
అని సూచనలు, సలహాలు ఇస్తున్నా సీఎం జగన్ వాటిని బుట్టదాఖలు చేస్తుండడంతోపాటు ఇలా సలహాలు ఇస్తున్న వారిని పక్కన పెట్టేస్తున్న పరిస్థితి.. తనను గుడ్డిగా సమర్థించేవారిని అక్కున చేర్చుకుంటున్న వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. రాజధాని అమరావతిపై రైతులు హైకోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హుటాహుటిన ప్రభుత్వ వాదనను వినిపించేలా.. దేశంలోనే ప్రఖ్యాతి పొందిన ముకుల్ రస్తోగీని సీఎం జగన్ సర్కారు సంప్రదించింది.
అంతేకాదు.. అప్పటికప్పుడు దేశంలో ఇప్పటి వరకు ఇవ్వని ఫీజు.. రూ.5 కోట్లను ఆయనకు ఆఫర్ చేస్తూ.. ఏకంగా సర్కారు జీవోనే విడుదల చేసింది. మరి అలాంటి రస్తోగీ.. సీఎం జగన్ నుంచి భారీగా లబ్ధి పొందిన అత్యున్నత న్యాయవాది.. ఇప్పుడు జగన్ న్యాయవ్యవస్థతో తలపడుతున్న తీరును ఎలా చూస్తున్నారు? ఏమంటున్నరు? అంటే.. ఖచ్చితంగా ఆయన కూడా జగన్‌ను ఇలా చేయొద్దు.. మున్ముందు మరిన్ని చిక్కుల్లో పడతారు. నా మాట వినండి.. రచ్చ చేసుకోవద్దు!
అనే సూచిస్తున్నారు. ఇలా ఆయన ఒక్కరే కాదు.. హరీష్ సాల్వే సహా జాతీయ స్థాయిలో న్యాయ శాస్త్రాన్ని ఔపోసన పట్టిన న్యాయవాదులు కూడా జగన్‌కు ఇదే సూచిస్తున్నారు. కానీ, మనోడు వినడం లేదు.
న్యాయవ్యవస్థపై ఎంతకైనా పోరాడేందుకు తాను సిద్ధమేనని.. ఈ విషయంలో మడమ తిప్పేది లేదని స్పష్టం చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రభుత్వానికే ఎసరొచ్చినా ఖాతరు చేసేది లేదని ఆయన స్పష్టం చేస్తున్నారట. అంతేకాదు, తాజాగా అందరూ చెప్పుకొంటున్నట్టు రేపు సీఎం జగన్ అరెస్టయితే.. ఆయన సతీమణి భారతి ముఖ్యమంత్రి అవుతారనే విషయాన్ని కూడా సీఎం కొట్టిపారేస్తున్నారు. అదే పరిస్థితి ఎదురైతే.. ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మళ్లీ ఎన్నికలకు వెళ్దామని.. అంతే తప్ప.. వెనక్కి మాత్రం తగ్గేది లేదని భీష్మించినట్టు వైసీపీలో చర్చ జరుగుతోంది. ఏ వ్యవస్థా తనను ఆపబోదని ఫక్తు.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్నుమించిన శైలిలో వ్యాఖ్యలు సంధిస్తున్నారట.
రేపు ఒకవేళ.. జగన్ అరెస్టయి.. ఆయన కోరుకుంటున్నట్టు మధ్యంతరమే వస్తే.. వైసీపీ బతికి బట్టకడుతుందా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన మర్నాడే.. ప్రజావేదిక కూల్చివేత, తర్వాత ఇసుక, లిక్కర్ మైనింగులు, ఏడాది తిరిగే లోపే రాజధాని తరలింపు, భూ కుంభకోణాలు, టీటీడీ ఆస్తలు విషయంలో అనుసరిస్తున్న వైఖరితో జగన్ సర్కారు భ్రష్టు పట్టిపోయిందనే వాదన శ్రీకాకుళం నుంచి సింగపూర్ వరకు వినిపిస్తోంది. ఒకప్పుడు విదేశాల్లోని వారు కూడా జగన్‌కు మద్దతుగా ముందుకు వచ్చారు.కానీ, ఇప్పుడు ఆయన వైఖరిని గమనిస్తున్నవారు సైలెంట్ అవుతున్నారు. అంతేకాదు.. జగన్ నిర్ణయం పార్టీపై ఎంతగా ప్రభావం చూపుతుందో అంచనా వేసుకుని బుగ్గలు నొక్కుకుంటున్నారు.
ఆయనకేమైంది. ఆయన బాగానే ఉంటారు. కానీ, ఎటొచ్చీ.. ఎమ్మెల్యేలే అన్యాయమై పోతారనే వాదన వినిపిస్తోంది. జగన్ వైఖరి చూస్తే.. పాము తన పిల్లలను తానే మింగేసినట్టుగా ఉందని అంటున్నారు. తన అహంభావ వైఖరి, వ్యక్తిగత స్వార్థాలతో వ్యవస్థలతో ఢీకొనడంతో ఎమ్మెల్యేలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందని హెచ్చరిస్తున్నారు. ఇదిలావుంటే, న్యాయవ్యవస్థపై జగన్ చేసిన ఆరోపణలు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖరాయడంపై అనుకూలంగా వాయిస్ వినిపించేందుకు వైసీపీ నానా తంటాలు పడుతోంది. ఇటీవల వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డి జాతీయస్థాయిలో సీనియర్ అడ్వొకేట్లను సంప్రతించారు.
బాబ్బాబు.. ఒక్కసారి తాడేపల్లికి రండి. జగన్‌కు అనుకూలంగా వాయిస్ వినిపించండి. మీకు అవసరమైన సకల ఏర్పాట్లు చేస్తాం
అని సాయిరెడ్డి కొందరు న్యాయవాదులను సంప్రదించినట్టు తెలిసింది. ఈ క్రమంలో ఆయన స్పెషల్ ఫ్లైట్స్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ, ఒక్కరంటే.. ఒక్కరు కూడా సానుకూలంగా స్పందించకపోగా.. కొరివితో తలగోక్కోవడం మీకే చెల్లింది. ఈ వివాదంలోకి మమ్మల్నెందుకు లాగుతారు! అని ఒకింత కఠినంగానే వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఇక, ఈ పరిణామాలపై దేశవ్యాప్తంగా బార్ అసోసియేషన్లు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై ఉన్న అక్రమ ఆస్తుల కేసులను ఇక నుంచి వాదించరాదని సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.
ఆయనో(జగన్) మూర్ఖుడు, అవివేకి,తన అహంతో మితిమీరుతున్నారు. ఫలితం అనుభవిస్తాడు
అని సదరు న్యాయవాదులే వ్యాఖ్యానించినట్టు వార్తలు వస్తున్నాయి. అయినా.. ఈ విషయంలో ఆత్మ పరిశీలన చేసుకోనంటున్న జగన్‌ను ఆ దేవుడు కూడా కాపాడే పరిస్థితి లేదని అంటున్నారు పరిశీలకులు. కాగా, జగన్ దూకుడు వెనుక, నేరుగా పోయి పోయి.. న్యాయవ్యవస్థతో తలపడడం వెనుక బీజేపీ ఉందనే వ్యాఖ్యలకు చెక్ పెడుతూ.. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “జగన్ వెనుక బీజేపీ లేనేలేదు.
న్యాయవ్యవస్థతో తలపడాలని మోదీ, అమిత్ షా వంటివారు ఎప్పుడూ చెప్పరు. గతంలో వారి కేసుల విషయంలోనూ వారు ఏనాడూ విమర్శలు చేయలేదు. సానుకూలంగా పరిష్కరించుకున్నారు. అలాంటివారు ఇప్పుడు జగన్ వెనుక ఉండాల్సిన అవసరం ఏముంటుంది?“ అని సాల్వే.. ముకుల్ రస్తోగీకి చెప్పినట్టు.. ఢిల్లీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అంటే.. మొత్తంగా న్యాయ వాదులు ఇప్పుడు జగన్‌కు దూరమైపోయారనే చెప్పాలి. మరి ఆయన ఎలా బయట పడతారో చూడాలి.