ఫాస్ట్ ఫుడ్.. పిజ్జా.. బర్గర్.. మెమోస్.. షవర్మా లాంటి ఫుడ్ తినేవేళలో కలిపి తినేందుకు ఇచ్చే మయోనైజ్ (మన మాటల్లో చెప్పాలంటే సాస్/చట్నీ లాంటిది) ను బ్యాన్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గడిచిన రెండు వారాల్లో కలుషిత మయోనైజ్ కారణంగా ఒకరు మరణించటం.. 50 మంది వరకు అనారోగ్యం బారిన పడిన నేపథ్యంలో ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రజారోగ్య పరిరక్షణ విషయంలో రాజీ పడేది లేదన్న విషయాన్ని తాజా నిర్ణయంతో రేవంత్ సర్కారు చెప్పేసింది.
పచ్చిగుడ్లతో తయారు చేసే మయోనైజ్ వినియోగం.. నిల్వలపై బ్యాన్ విధిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిషేధం నిన్నటి నుంచి (బుధవారం, 30 అక్టోబరు నుంచి) అమల్లోకి వచ్చింది. ఏడాది పాటు దీనిపై బ్యాన్ విధించారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని చికెన్ మెమోస్ తిని ఒకరు చనిపోవటం తెలిసిందే. పాశ్చరైజ్డ్ గుడ్లతో తయారు చేసి అమ్మే బ్రాండెడ్ మయోనైజ్.. శాఖాహార పదార్థాలతో తయారు చేసే మయోనైజ్ వినియోగంపై మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో క్లారిటీ ఇవ్వలేదు.
మెమోస్ ను మయోనైజ్ తో కలిసి తినటం వల్లే బంజారాహిల్స్ ఘటనలో ఒకరి మరణం.. పలువురి అనారోగ్యం బారిన పడినట్లుగా మంత్రి దామోదర్ రాజనర్సింహతో జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. మయోనైజ్ నాణ్యత.. దాన్ని తిన్న తర్వాత వచ్చే దుష్పరిణామాలపై ఇటీవల ఎక్కువగా కంప్లైంట్లు వస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గుడ్లతో తయారు చేసే మయోనైజ్ పై బ్యాన్ చేయాలని కోరారు. దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహతో చర్చించిన తర్వాత బ్యాన్ నిర్ణయాన్ని ప్రకటించారు. సో.. బ్రాండెడ్ మయోనైజ్ మార్కెట్లో దొరుకుతంది. కేవలం పచ్చి సొనతో తయారు చేసే విధానానికి మాత్రం చెక్ పెట్టారు.