విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ దివంగత మహానేత నందమూరి రామారావు శత జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. శక పురుషుడి శత జయంతి వేడుకలు పేరుతో టీడీపీ ఈ వేడుకలను గత ఏడాది కాలంగా ఘనంగా నిర్వహిస్తోంది. ఈ ఏడాది మే 28 నాటికి అన్నగారు జన్మించి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. గత ఏడాది ఏప్రిల్ 28 నుంచి ఈ ఏడాది మే 28 వ తేదీ వరకు ఊరూ వాడా..దేశ విదేశాలలో శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన అన్నగారి శత జయంతి సందర్భంగా తెలుగోడికి మరో అరుదైన గౌరవం దక్కింది. 2023, మే 28వ తేదీని ‘‘తెలుగు వారసత్వ దినం’’ (TELUGU HERITAGE DAY)గా అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఫ్రిస్కో నగర్ మేయర్ జెఫ్ షెనీ ప్రకటించడం నిజంగా తెలుగువారందరికీ గర్వకారణం.
ప్రాచీన భాషలలో తెలుగు ఒకటని, ప్రపంచలోని ప్రతి దేశంలో తెలుగువారున్నారంటే అతిశయోక్తి కాదని జెఫ్ అన్నారు. తెలుగు వారి క్రమశిక్షణ, కుటుంబ విలువల పట్ల వారికుండే గౌరవం, నిబద్ధత అందరికీ ఆదర్శప్రాయమని జెఫ్ అన్నారు. ఫ్రిస్కోలో నివసిస్తున్న తెలుగువారి సంఖ్య నానాటికి పెరుగుతోందని, ఇక్కడి తెలుగు కుటుంబాలు, వారి సంస్కృతి సంప్రదాయాలతో మమేకమవుతూ విద్య, వైద్యం, వాణిజ్యం, ప్రభుత్వ, కళా రంగాలలో పోషిస్తున్న పాత్ర మరువలేనిదని జెఫ్ అన్నారు.
ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారకరామారావు రాజకీయవేత్తగా, నటుడిగా తెలుగు కళారంగానికి, తెలుగు జాతికి ఎనలేని సేవలందించారని కొనియాడారు. మానవతావాదిగా, నిజాయితీపరుడిగా, ప్రజాసేవకుడిగా ఎన్టీఆర్ అందించిన సేవలు మరువలేనివని ప్రశంసించారు. అందుకే, ఈ ఏడాది ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా 2023, మే 28వ తేదీని ‘‘తెలుగు వారసత్వ దినం’’ (TELUGU HERITAGE DAY)గా ప్రకటిస్తున్నానని వెల్లడించారు.
ఫ్రిస్కోలో చిరకాలంగా నివసిస్తున్న తెలుగువారి పట్ల ప్రత్యేక గౌరవం, శ్రద్ధ చూపుతూ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా తెలుగు వారసత్వ దినాన్ని ప్రకటించిన జెఫ్ కు తెలుగువారంతా ధన్యవాదాలు తెలియజేశారు. గతంలో, ఉగాదిని తెలుగు భాషా వారసత్వ దినంగా టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. శుభ కృత్ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని “తెలుగు భాషా వారసత్వ దినంగా” గ్రెగ్ అబ్బాట్ ప్రకటించారు.