తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నారంటే అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉంటుంది. ప్రతిపక్షాలకు తనదైన శైలిలో కౌంటర్ పంచ్‌లు వేస్తూ.. విపక్షాల విమర్శలను తిప్పికొడతారు. తాజాగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలోనూ కేసీఆర్ అదే పంథాలో సాగారు.
తన పార్టీపై తన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీని మాటలతోనే చీల్చి చెండాడారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుపైనా మాటల తూటాలు పేల్చారు. పెట్రోల్‌పై తమ ప్రభుత్వం ఒక్క పైసా కూడా వ్యాట్ పెంచలేదని ఇప్పుడు తగ్గించనని తేల్చి చెప్పారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా నిలుస్తామన్నారు. వరి విషయంలో కేంద్రం వైఖరిని తప్పు పట్టారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మెడలు పగలగొడతానని తీవ్రంగా హెచ్చరించారు.
అయితే ఈ ప్రెస్మీట్లో కాంగ్రెస్ పార్టీపైనా రేవంత్ రెడ్డినైనా కేసీఆర్ ఒక్క విమర్శ కూడా చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బీజేపీని లేపుతున్నారా?
ప్రెస్మీట్లో కేసీఆర్ అన్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే రాష్ట్రంలో బీజేపీని లేపేందుకు ఆయన పరోక్షంగా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీనే ఉందని ప్రజల్లో ఓ భావన కలిగించేందుకే కేసీఆర్ ఆ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేశారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
బీజేపీకి తెలంగాణలో పుంజుకునే అవకాశం కనిపించడం లేదు. ఒక్క హైదరాబాద్ తప్పితే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందనేది వాస్తవమని విశ్లేషకులు అంటున్నారు.
దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచారంటే అందుకు కారణం అక్కడి స్థానిక ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం, సానుభూతి మాత్రమే. అదేసమయంలో అప్పటికి కేసీఆర్ పై కోపాన్ని చూపడానికి జనం ఒక తాత్కాలిక అవకాశంగా వాడుకున్నారు.
హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ విజయానికి కూడా ఆయన వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే కారణం.
మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రధానంగా కేసీఆర్ బీజేపీని లక్ష్యంగా చేసుకుని ఆ పార్టీకి ఎందుకు మైలేజీ ఇస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
రేవంత్‌ను దెబ్బకొట్టేందుకు..
బీజేపీపై కేసీఆర్ ఫోకస్ పెట్టడం వెనక రేవంత్ రెడ్డిని ఆపాలనే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి దూకుడుగా సాగుతున్నారు.
కేడర్ లో ఎన్నడూ లేని ఉత్సాహం కనిపించింది. సీనియర్లు కూడా నోరుమూసుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.
రేవంత్ రెడ్డి క్రేజును చూసి కేసీఆర్ కు జగన్ కి భయమేసింది. బీజేపీకి రేవంత్ ఎదుగుదలలో తమ పార్టీ పతనం కనిపించింది.
పైగా అప్పటికే కేసీఆర్‌కు రేవంత్ కొరకరాని కొయ్యలా మారారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్ అడుగులు వేస్తున్నారు. ప్రజల స్పందన కూడా అలాగే ఉంది.
ప్రజల మూడ్ ఎపుడూ కనిపించకుండానే ఏకాభిప్రాయం ఉన్నట్టు ఎన్నికల ఫలితాలు వస్తుంటాయి.
టీఆర్ఎస్ పై ప్రజల ఆగ్రహం, రేవంత్ కు వస్తున్న స్పందన చూస్తే ఇలాగే వదిలేస్తే రేవంత్ ను తెలంగాణ ప్రజానీకం ఏకైక హోప్ గా చూస్తుందని బీజేపీ, కేసీఆర్, జగన్ ముగ్గురు గ్రహించారు.
అసలే వరుసగా రెండు ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఆ వ్యతిరేకత ఒకేవైపు మళ్లకుండా ఇప్పటికే ప్రయోగించిన షర్మిల బాణం పెద్దగా విజయవంతం అయినట్టు కనిపించడం లేదు. దీంతో కేసీఆర్ -బీజేపీ- జగన్ కలిసి కొత్త వ్యూహానికి తెరలేపారు.
ఈ వ్యూహానికి ఒకటే టార్గెట్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభం చేకూరకూడదు. గంపగుత్తగా ఓట్లు పడకూడదు.
కాంగ్రెస్ ని అడ్డుకోవాలంటే కేసీఆర్ కు ఉన్న ఒకటే రాజకీయ అవకాశం బీజేపీ. ఈ ఉద్దేశంతోనే బీజేపీని పైకి లేపడానికి కేసీఆర్ సిద్ధమయ్యారు.
ఆ పార్టీ మీద ఫోకస్ చేసి ప్రజల్లో చర్చనీయాంశం అయ్యేలా కేసీఆర్ నడుచుకుంటారు. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉందనే భావన ప్రజల్లో కలిగించడమే బీజేపీపై కేసీఆర్ విమర్శల వెనుక ఉన్న లక్ష్యం.
బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా నిలబెట్టడంతో ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి కాంగ్రెస్ సొంతంగా అధికారంలోకి రాకుండా చేయడం వల్ల బీజేపీకి 2029లో మార్గం సుగమం అవుతుంది.
2023లో రేవంత్ నుంచి కేసీఆర్ కు తప్పించుకోవడం సాధ్యమవుతుంది. ఈ ఒక్కసారి రేవంత్ ను అడ్డుకుంటే ఇక రేవంత్ ప్రభ తగ్గిపోతుందన్నది వారి అసలు అంచనా.
మ్యాచ్ ఫిక్స్ – 2023, 2029లో బీజేపీతోనే టీఆర్ఎస్ దోస్తీ
మరోవైపు సుదీర్ఘ లక్ష్యాలు పెట్టుకునే బీజేపీ 2029లో తెలంగాణలో పాగా వేసేందుకు అడుగులు వేస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ అధికారంలోకి రాలేమని తెలుసు. అయితే, 2029లో అధికారంలోకి రావాలంటే వచ్చే ఎన్నికల్లో ఒక 15- 20 సీట్లు రావాలి. అలా జరగాలంటే కేసీఆర్ హెల్ప్ కావాలి.
రాష్ట్రంలో ఎన్నికల ముందు అయినా, ఎన్నికల తర్వాత అయినా కేసీఆర్ ఎవరితోనైనా దోస్తీ కడతారు అంటే అది కేవలం బీజేపీతో మాత్రమే.
ఎందుకంటే సోనియా కేసీఆర్ చేసిన మోసాన్ని మరిచిపోలేదు. రేవంత్ అయితే, అసలు కేసీఆర్ ను ఎన్నటికీ కాంగ్రెస్ తో కలవనివ్వడు.
అంటే కేసీఆర్ కు మిగిలి ఉన్న ఏకైక అవకాశం బీజేపీ. బీజేపీకి కూడా తెలంగాణలో కలవడానికి ఉన్న ఏకైక అవకాశం టీఆర్ఎస్. ఎన్నటికీ కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకునే అవకాశం లేనపుడు కచ్చితంగా వారు టీఆర్ఎస్ తో తప్ప మరే పార్టీతో కలవలేరు. తెలంగాణలో ఇంకే పార్టీ బలంగా కూడా లేదు.
ఈసారి ఒక్కటి టీఆర్ఎస్ వస్తే చాలు ఎలాగూ ప్రజలు నాలుగోసారి ఛాన్స్ ఇవ్వరు. అపుడు బీజేపీ వచ్చినా చాలు అన్నది కేసీఆర్ బీజేపీల అంచనా.
అంటే 2023, 2028లో బీజేపీ టీఆర్ఎస్ ఉమ్మడి ప్రభుత్వమే తెలంగాణలో ఏర్పడుతుందన్నది కేసీఆర్ బీజేపీల లెక్క. దానికోసమే భారీ కుట్రకు తెలేపారు.
అందరికీ అడ్డు రేవంత్
వీరందరి ప్లాన్ లకు అడ్డు… రేవంత్ రెడ్డి. అందుకే 2024లో రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ అధికారంలోకి రాకూడదు.
ఇది కేసీఆర్ బీజేపీకే కాదు వీరిద్దరి ఉమ్మడి మిత్రుడు జగన్ కి కూడా అవసరం. అలా రేవంత్‌ను ఆపాలంటే ఇప్పుడు బీజేపీని లేపాలన్నది కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
అందుకే తన విమర్శలను కేవలం బీజేపీపైకే ఎక్కుపెట్టి ఆ పార్టీకి ప్రజల్లో ప్రాధాన్యత పెరిగేలా చేస్తున్నారు. లేకపోతే కాంగ్రెస్ గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని విశ్లేషకులు అంటున్నారు.
కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని నిలబెట్టిందని బీజేపీతో ఆ పార్టీ కుమ్మక్కైందని అందుకే ఈటల గెలిచారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ కేసీఆర్ మాత్రం ఈ విషయంపై ఒక్క మాట కూడా మాట్లడలేదు.
తెరవెనక జగన్..
రేవంత్‌రెడ్డిని అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రణాళికల వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉంటేనే తనకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న తన వ్యాపారాలకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదన్న.. అక్కడ తన ప్రత్యర్థి చంద్రబాబుకు సానుకూలుడు అయిన రేవంత్ పుంజుకోకూడదంటే తెలంగాణ సీఎంగా కేసీఆర్ ఉండడమే జగన్‌కు కావాల్సిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందుకే రేవంత్‌ను అడ్డుకునేందుకు కేసీఆర్‌కు ఆర్థికంగా.. ఇతర రకాలుగా కూడా జగన్ సాయం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్‌కు పడే ఓట్లను చీల్చేందుకే తెలంగాణలో తన సోదరి షర్మిలను ఆయన రంగంలోకి దింపారని ఇప్పటికే ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో పాటు తరచు తెలంగాణ ప్రముఖ రెడ్లతో రహస్య సమావేశాలు ఏర్పాటుచేసి వారిని రేవంత్ వైపు మళ్లకుండా, రేవంత్ కు ఆర్థిక సహాయం చేయకుండా అడ్డుకుంటున్నారని విశ్వసనీయ సమాచారం అందుతోంది.
ఇటీవల జగన్ మిత్రుడు అయిన ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త ద్వారా రెడ్డి ప్రముఖులను జగన్ కలుస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.