అధికారం చేపట్టిన వ్యక్తికి నిబంధనల కంటే కూడా తాను అధికారంల ఉండిపోవాలన్న ఆకాంక్షకు మించిన ప్రమాదం మరొకటి ఉండదు. దేశ శ్రేయస్సు పేరుతో నచ్చినట్లుగా రాజ్యాపాలన చేసే దేశాలు ప్రపంచంలో చాలానే ఉంటాయి. కానీ.. రష్యాలాంటి దేశంలో అలాంటి పరిస్థితి ఏర్పడటం.. తనను తాను శాశ్విత అధ్యక్షుడిగా పుతిన్ అనుకోవటమే తడువు.. చట్టాలు అందుకు తగ్గట్లుగా తయారైన వైనం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన రాజకీయ ప్రత్యర్థులు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జైలుకు పంపే అలవాటు పుతిన్ కు ఎక్కువనే విమర్శ ఉంది.
మరీ.. ఇబ్బంది అనుకుంటే.. విష ప్రయోగాలు జరిగిపోవటం.. అనంతలోకాలకు పయనం కావటం లాంటివి చాలా సింఫుల్ గా జరుగుతాయన్న ఆరోపణలు ఉన్నాయి. దీనికి నిదర్శనంగా రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్ని ఉదంతాన్ని గుర్తు చేస్తారు. విపక్ష నేతగా వ్యవహరిస్తున్న ఆయనపై సొంత దేశంలోనే విష ప్రయోగం జరిగింది. దీంతో.. జర్మనీకి ఆయన్ను తరలించి.. పెద్ద ఎత్తున వైద్యం నిర్వహించారు. దాదాపు ఐదు నెలల అనంతరం.. పూర్తిస్వస్థత చేకూరటంతో ఆయన స్వదేశానికి పయనమయ్యారు.
జనవరి 17న రష్యాకు చేరుకున్నంతనే ఆయన్ను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. ఎయిర్ పోర్టులో అరెస్టు అయిన వెంటనే ఆయన్ను అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. గతంలో రద్దు చేసిన శిక్షకు సంబంధించిన షరతుల్ని ఉల్లంఘించిన ఆరోపణల్ని ఆయన ఎదుర్కొంటున్నారు. అందుకే.. ఆయనకు రెండున్నరేళ్ల జైలుశిక్షను విధిస్తూ మాస్కో కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మాస్కో తీర్పుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనపై వస్తున్న ఆరోపణల్ని అధికార పార్టీ కల్పితాలుగా ఆరోపించారు. కోర్టు తీర్పును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. లోదుస్తుల్లో విషం పెట్టే వ్యక్తిగా అధ్యక్షుడు పుతిన్ ను అభివర్ణించిన ఆయన.. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీలు చేస్తామన్నారు. నావల్నీకి మద్దతుగా రష్యాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనకు దన్నుగా ప్రపంచంలోని పలు దేశాలు మద్దతు తెలుపుతున్నాయి. మాస్కోలో పెద్ద ఎత్తున నిరసనల్ని చేపట్టారు.
నిరసనకారులపై భద్రతా సిబ్బంది విరుచుకుపడుతున్నారు. నావెల్నికి శిక్ష విధిస్తూ తీసుకున్న నిర్ణయంపై పలు దేశాలు మండిపడుతున్నాయి. తాజా తీర్పుపై మండిపడుతున్న వేళ.. నావెల్ని మీడియాతో మాట్లాడుతూ..రష్యా తన పౌరుల హక్కుల్ని కాపాడటంలో విఫలమైందన్నారు. ఈ విషయంలో ఆయన ఇతర దేశాల వారితో కలిసి పని చేస్తానని చెప్పారు. ఇదంతా చూసినప్పుడు రష్యా ఎలా అయిపోయిందన్న భావన కలుగక మానదు.