తెలంగాణలో కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అందరూ ఊహించినట్లుగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టుగా శశిధర్ రెడ్డి ప్రకటించారు. చాలా బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని, కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసమే తానీ నిర్ణయం తీసుకున్నానని శశిధర్ రెడ్డి అన్నారు. రాజీనామాకు గల కారణాలను సోనియా గాంధీకి లేఖ రాశానని చెప్పారు.
రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించిన శశిధర్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పార్టీ నుంచి బహిష్కరించిన సంగతి తెలిసిందే. అంతకుముందు బిజెపి నేత డీకే అరుణతో కలిసి శశిధర్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో ఆయన బిజెపిలో చేరిపోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని శశిధర్ రెడ్డి కొట్టి పారేశారు. కానీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆయనను బహిష్కరించడంతో తాజాగా రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీ వీడుతున్నందుకు బాధగా ఉందని, పార్టీ గుర్తు ఎంపికలో తన తండ్రి మరి చెన్నారెడ్డి పాత్ర కూడా ఉందని అన్నారు. పార్టీతో తనకు చాలా అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. అయితే, తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని, కాంగ్రెస్ లో ఈ పరిస్థితి ఎప్పుడు ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఇచ్చే వాళ్ళ మాట చెల్లుతుందని, పార్టీలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నందునే రాజీనామా చేశానని అన్నారు.